అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ కీలక నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సిఐడి అధికారులు తాజాగా నాన్ బెయిలబుల్ వారంట్ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లోకేష్ పై చర్యలు తీసుకోవాలని, అందుకు అనుమతి కోరుతూ వారు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ హాట్ టాపిక్ గా మారింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41 ఏ నోటీసు నిబంధనలను లోకేష్ అతిక్రమించారని సిఐడి అధికారులు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రెడ్ బుక్కులో అధికారుల పేర్లున్నాయంటూ లోకేష్ బెదిరింపులకు దిగుతున్నారని వారు ఆరోపించారు. అందుకు సాక్షాలు చూపించాలని న్యాయమూర్తి ప్రశ్నించగా వారు కొన్ని పేపర్ కటింగ్ లు చూపించారు. వాస్తవానికి ఈ కేసులో లోకేష్ కు గతంలోనే సిఐడి అధికారులు 41ఏ నోటీసులు జారీ చేశారు. దీంతో, విచారణకు రావాలని కూడా లోకేష్ ను పిలిచారు. అయితే, కోర్టు నుంచి స్టే తెచ్చుకోవటంతో విచారణ జరగలేదు.