రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హఠాత్తుగా ప్రకటించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తమతో చర్చ జరపకుండా పవన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సీఎం అభ్యర్థిగా పవన్ పేరు ప్రకటిస్తారని జనసైనికులు ఆశించినా…అది జరగలేదు.
ఈ క్రమంలోనే అనుభవం ఉన్న చంద్రబాబే కాబోయే సీఎం అని లోకేష్ చేసిన కామెంట్లు జనసేన నేతలకు మింగుడుపడడం లేదు. చంద్రబాబు అనుభవం ఏపీకి కావాలని పవన్ కూడా అన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ కు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య సంచలన లేఖ రాశారు. లోకేష్ చెబుతున్నట్టుగా ఐదేళ్లపాటు చంద్రబాబును సీఎం చేసేందుకు మీరు ఒప్పుకున్నారా? అని పవన్ ను జోగయ్య ప్రశ్నించారు.
జనసైనికులంతా పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని, అలా జరగకుంటే వారి కలలు ఏం కావాలని ప్రశ్నించారు. జనసేనకు ఓటేసి చంద్రబాబు సీఎం అవుతారంటే జనసైనికులు ఒప్పుకోలేరని కుండబద్దలు కొట్టారు. పవన్ నీతివంతమైన పాలన అందిస్తారని భావించే ప్రజానీకానికి ఏం సమాధానం చెపుతారని పవన్ ను జోగయ్య ప్రశ్నించారు. రెండు కులాలు రాజ్యమేలుతున్నాయని, మరి, బడుగు, బలహీనవర్గాలకు మోక్షం ఎప్పుడని ప్రశ్నించారు.
పవన్ ముఖ్యమంత్రి కావాలని, జనసేన అధికారంలోకి వచ్చి బడుగు బలహీనవర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలని జనసేన నేతలు, కార్యకర్తలు కంటున్న కలలు ఏం కావాలని పవన్ ను నిలదీశారు. ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తున్నామని, రాజ్యాధికారం చేపట్టే విషయంలో మీ వైఖరి జనసైనికులకు అర్థమయ్యేలా చెప్పాలని కోరారు. మరి, ఈ లేఖపై పవన్ ఏరకంగ స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.