తెలంగాణలో కొన్నివారాల కిందటే అధికారం కోల్పోయిన బీఆర్ ఎస్ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగి లింది. ప్రస్తుతం జరగనున్న సింగరేణి కార్మికుల ఎన్నికల్లో ఈ పార్టీ పోటీకిదూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా ఇక్కడ బీఆర్ ఎస్‌కు మంచి పట్టుంది. ముఖ్యంగా పార్టీ నాయకురాలు. ఎమ్మెల్సీ కవిత కార్మిక సంఘం ఎన్నికల్లో చక్రం తిప్పుతున్నారు.
అయితే.. అనూహ్యంగా తాజా ఎన్నికల్లో మాత్రం ఈ పార్టీ అనుబంధం సంఘం టీబీజీకేఎస్ పోటీ నుంచి తప్పుకోనుంది. ఈ మేరకు ఆ సంఘానికి మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి బెల్ట్‌లోనూ బీఆర్ ఎస్ కు ఘోర పరాజయం ఎదురైంది. దీంతో కేసీఆర్ అన్ని చేసినప్పటికీ.. తమకు కార్మికులు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయంపై అంతర్మథనం చెందుతున్నారు.
ఈ క్రమంలోనే పార్టీ అనుబంధ సంఘాన్ని ఎన్నికలకు దూరంగా ఉంచాలని నిర్ణయించారు. ఇదిలావుంటే.. కేసీఆర్ నిర్ణయంపై టీబీజీకేఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ నిర్ణయం ఆత్మహత్యా సదృశమని కొందరు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన సంఘాన్ని పోటీ చేయొద్దని ఆదేశించడం బాధాకరమని అంటున్నారు.
ఎన్నికలకు సమాయత్తం
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. కేంద్ర లేబర్ కమిషనర్ ఎన్నికల తేదీ ప్రకటించగా, నామినేషన్ల ప్రక్రియ, గుర్తుల కేటాయింపు పూర్తయ్యింది. కార్మిక సంఘాలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇంతలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంధన కార్యదర్శి ఎన్నికల నిలుపుదలకు కోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. కానీ ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చిం ది. దీంతో కార్మిక సంఘాలు, కార్మికులు హర్షం వ్యక్తం చేసున్నారు.