నువ్వు ఒకటి అంటే.. నేను నాలుగు అంట. తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహార శైలి కొందరికి ఉంటుంది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతలా ఉంటారన్న విషయాన్ని తన మాటలతో మరోసారి స్పష్టం చేశారు. తనను.. తన రాజకీయ జీవితాన్ని ప్రశ్నించిన అక్బరుద్దీన్ ఓవైసీకి నోటి వెంట మాట రాలేని విధంగా పంచ్ ఇచ్చారు.
అంతేకాదు..మరోసారి తన రాజకీయ జీవితం గురించి ప్రశ్నించే ముందు.. మీ సంగతి చూసుకోండన్న రీతిలో సీఎం రేవంత్ సమాధానం ఉంది. బుధవారం హాట్ హాట్ గా సాగిన విద్యుత్ రంగంపై చర్చ నేపథ్యంలో ఒక దశలో ఫస్ట్రేషన్ కు గురైన అక్బరుద్దీన్ సీఎం రేవంత్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు.
‘‘సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకు అనేక పార్టీలు మారారు. ఇప్పుడు ముస్లింలకు తామే సీట్లు ఇచ్చామని చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ అంబేడ్కర్ ను గెలవకుండా చేసిన చరిత్ర కాంగ్రెస్ ది. తన ప్రసంగానికి పదే పదే అడ్డు పడుతూ.. మైకును నిలిపి వేస్తున్నారు. ముస్లింల గొంతును కాంగ్రెస్ ను నొక్కుతోంది’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
దీనికి అంతే తీవ్రంగా బదులిచ్చిన రేవంత్.. ‘‘మీరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చారు. తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టిన నాదెండ్ల భాస్కర్ రావు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. తర్వాత చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసిన రోశయ్య.. కిరణ్ కుమార్ రెడ్డిల ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డితో శత్రుత్వం పెట్టుకున్నారు.
ఆ తర్వాత పదేళ్లుగా కేసీఆర్ సర్కారుకు మద్దతు ఇచ్చారు. పార్టీలు మారే విషయంలో మీరు మాట్లాడటమా’ అంటూ ఫైర్ అయ్యారు. దీంతో.. ఆ అంశాన్ని వదిలేసి.. మరో అంశాన్ని ప్రస్తావించటం ద్వారా రేవంత్ సర్కారును ప్రశ్నించే ప్రయత్నం చేశారు అక్బరుద్దీన్.