బయటపడిన తెలంగాణా అప్పులను ఎలా సమర్ధించుకోవాలో బీఆర్ఎస్ కు అర్ధం అవటం లేదు. అప్పుల విషయం బయటపడకుండా దాదాపు పదేళ్లపాటు కేసీయార్ ప్రభుత్వం మూతేసి దాచిపెట్టింది. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా బయటపెట్టిన అప్పుల లెక్కలతో బీఆర్ఎస్ ఎంఎల్ఏ హరీష్ ఉలిక్కిపడ్డారు. అందుకనే అసెంబ్లీలో చర్చ సందర్భంగా అడ్డదిడ్డమైన సమర్ధనతో పాటు ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. వీళ్ళమాటల్లోనే అప్పులు బయటపడటాన్ని తట్టుకోలేకపోతున్నట్లు అర్ధమవుతోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణా అప్పుల వివరాలను, ప్రభుత్వం విడుదలచేసిన శ్వేతపత్రాన్ని ఏపీ అధికారులు తయారుచేశారట. తెలంగాణా అంటే పడని ఏపీ అధికారులు అందులోను ఏపీలో సస్పెండైన అధికారులతో రేవంత్ రెడ్డి అప్పుల లెక్కలను తయారుచేయించినట్లు హరీష్ రావు ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణా ప్రభుత్వ అప్పుల లెక్కలను ఏపీ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు తయారుచేశారని హరీష్ ఎలా అనగలిగారో అర్ధం కావటం లేదు. పైగా ఈ విషయంలోకి చంద్రబాబునాయుడును కూడా హరీష్ లాగారు.
అప్పుల వివరాలను ప్రభుత్వానికి అనుకూలంగా తయారు చేశారని చెప్పటమే విడ్డూరంగా ఉంది. ఇంతకాలం ప్రభుత్వం అప్పుల వివరాలను కేసీయార్ ప్రభుత్వం బయటపెట్టలేదు. కాబట్టి వాస్తవ అప్పులెంతన్న విషయం ఎవరికీ తెలీదు. పైగా ఇపుడు ప్రభుత్వం బయటపెట్టిన లెక్కల్లో చాలా తప్పులున్నట్లు హరీష్ చెబుతున్నారు. అదే నిజమైతే ఆ తప్పులేవో బయటపెడితే సరిపోతుంది. వాస్తవాలను బయటపెట్టేందుకు హౌజ్ కమిటి వేయాలన్న డిమాండు కూడా సబబుగానే ఉంది. అంతేకానీ మధ్యలో ఏపీ అధికారులను పిక్చర్లోకి లాగటం ఎందుకో అర్ధంకావటంలేదు. పదేళ్ళ తమ నిర్వాకాన్ని అంకెలతో సహా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బయటపెట్టిందన్న విషయాన్ని హరీష్ జీర్ణించుకోలేకపతున్నట్లున్నారు.
అధికారం పదేళ్ళు అనుభవించి… కొత్త ప్రభుత్వం రావడంతో సమయం కూడా ఇవ్వకుండా విమర్శలు మొదలుపెట్టారు. అప్పుల లెక్కలను తెలంగాణా అధికారులు కాకుండా ఏపీ అధికారులు తయారుచేశారని చెప్పటంలోనే హరీష్ అహంకారం బయటపడింది. అంటే హరీష్ కు తెలంగాణా అధికారులంటే ఎంతటి చిన్నచూపో అర్ధమవుతోంది. పదేళ్ళు ఆకాశమే హద్దుగా అధికారాలను చెలాయించిన హరీష్ రావు ఎన్నికల్లో పార్టీ ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వంపై అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.