విజయనగరంలో జరిగిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ కీలక నేత నందమూరి బాలకృష్ణ షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్ ఏం ఉద్ధరించాడని మరోసారి గెలిపించాలంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. కనకపు సింహాసనంపై శునకం అన్న సామెత చందంగా సైకో పెత్తనం సాగిస్తున్నారంటూ జగన్ పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చెత్త ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం ఉండటం రాష్ట్ర ప్రజల ఖర్మ అని, జగన్ పాలనలో అభివృద్ధి నిల్ అప్పులు మాత్రం ఫుల్ అని, అవి 5 లక్షల కోట్లు దాటాయని బాలకృష్ణ అన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. డ్రగ్స్, గంజాయి పండించడంలో రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా ప్రశ్నించిన వారిపై, రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏపీకి పరిశ్రమలు రావడంలేదని, అన్ని రంగాల్లో వెనుకబడ్డామని బాలయ్య బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
జగన్ పాలన విధ్వంసంతోనే మొదలైందని ఆయన తెలంగాణకు వెళ్లాలనుకుంటే సరిహద్దులోనే అక్కడ ప్రజలు కాల్చిపడేస్తారంటూ బాలయ్య బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలు చూసి మోసపోయి మరోసారి జగన్ కు ఓటు వేయొద్దని, వైసీపీ ఓడిపోకపోతే రాబోయే రోజుల్లో ప్రపంచ పటంలో ఏపీ ఉండదని బాలకృష్ణ చెప్పారు. పవన్, తాను సారూప్యత ఉన్న మనుషులమని, ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతామని, తెగించే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని లోకేష్ విజయవంతంగా పాదయాత్ర ముగించాడని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి ఓటు వేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని పిలుపునిచ్చారు. హిందూపురంలో అభివృద్ధి పనులను తాను, తన నాయకులు చేస్తున్నామని అన్నారు. ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదని, రోడ్లపై గుంతలు పూడ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన…అన్న శ్రీ శ్రీ కవితను బాలకృష్ణ ఉటంకించారు. ప్రజలను బానిసలుగా చేసి పాలన చేస్తున్నారని జగన్ పై విరుచుకుపడ్డారు. హైటెక్ సిటీ వంటిది చంద్రబాబు వల్లే సాధ్యమని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే, తెలుగు వారి ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించిన ఘనత చంద్రబాబుదని అన్నారు.
సమయం లేదు మిత్రమా విజయమా వీర స్వర్గమా అని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉచిత పథకాల మాయలో పడొద్దని చెప్పారు. విద్య, వైద్యం అన్ని రంగాల్లో రాష్ట్రం సర్వనాశనమైందని, ఒక నియంత పాలనపై విసిగి వేసారి ఆయనను బయటకు లాక్కొచ్చి తల నరికారని, ఆ రకంగా ఫ్రెంచ్ విప్లవం మొదలైందని అన్నారు. ప్రస్తుతం ఏపీలో కూడా అటువంటి విప్లవం రావాల్సిన అవసరం ఉందని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రజలపై జగన్ ది బూటకపు ప్రేమని, ఎవరిని ఉద్ధరించడానికి మళ్లీ జగన్ కు ఓటేయాలని ఒక్క ఛాన్స్ అంటూ గతంలో ఓట్లు దండుకున్నాడని విమర్శించారు.