టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన `యువగళం-నవశకం` పాదయాత్ర ముగింపు సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సభను ముందు నుంచి ప్రతిష్టాత్మకంగా భావించిన టీడీపీ.. ఆదిశగానే సక్సెస్ చేయడంలో విజయవంతం అయింది. ఏకంగా.. 9 రైళ్లను, వందలాది ప్రైవేటు బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఆరు లక్షల మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు.. స్థానికులు ప్రజలు వస్తారని అంచనా వేసిన పార్టీ అధిష్టానం ఆమేరకు ఏర్పాట్లు చేసింది.
అయితే.. అంతకుమించి ప్రజలు యువగళం సభకు తరలి వచ్చారు. కర్నూలు, కడపల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడం పార్టీలో మరింత సంతోషాన్ని, ఉత్సాహాన్ని పెంచిందనే చెప్పాలి. మరోవైపు.. అభిమానులు.. కొందరు ఎన్టీఆర్, చంద్రబాబు, నారా లోకేష్ వేషాలు ధరించి సభలో సందడి సృష్టించారు. ఇక, మరిందరు అభిమానులు.. పాదయాత్రగా తరలివచ్చారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద జరిగిన ‘యువగళం- నవశకం’.. సభ అనూహ్య రీతిలో సక్సెస్ కావడంతో పార్టీలో సంతోషం వెల్లివిరిసింది.
ప్రత్యేక ఆకర్షణగా.. ఎన్నారైలు
యువగళం ముగింపు సభలో ఎన్నారై టీడీపీ అభిమానులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమెరికా, దుబాయ్ దేశాలకు చెందిన సుమారు 250 మంది ఎన్నారై టీడీపీ నాయకులు, కార్యకర్తలు యువగళం సభకు ప్రత్యేకంగా తరలి వచ్చారు. ఇక, టీడీపీ బలమైన జిల్లాలైన కృ్ష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఈ సభకు తరలి వచ్చారు. ఇక, సభకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం వరకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
ప్రతినిధులకు బస కూడా ఏర్పాటు చేశారు. సీబీఎన్ ఆర్మీ మరింత ప్రత్యేకంగా సేవలు అందించింది. ఎక్కడా అలుపెరగకుండా.. సభను సక్సెస్ చేయడంలో సీబీఎన్ ఆర్మీ.. చాలా కష్టపడిందనే చెప్పారు. ఈ సభలోనే కొందరు టీడీపీ సభ్యత్వం పుచ్చుకోవడం గమనార్హం. మరికొందరు.. పార్టీకి విరాళాలు కూడా ప్రకటించారు. మొత్తంగా.. ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్ర ముగింపు సభ నభూతో.. అన్న విధంగా సాగడం గమనార్హం.