కుక్క తోకను ఊపాలి కాని తోక ఎక్కడైనా కుక్కను ఊపుతుందా ? అన్నది తెలుగులో పాపులర్ సామెత. కానీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాటలు మాత్రం అచ్చంగా తోక కుక్కను ఊపినట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే సీపీఐ వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడే నారాయణ లాజిక్ ఏమిటో ఎవరికీ అర్ధంకావటంలేదు. కేవలం కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే సీపీఐ పోటీచేసి గెలిచిన విషయం తెలిసిందే.
ఒక్క నియోజకవర్గంలో పోటీచేసి గెలిచిన సీపీఐ 64 నియోజకవర్గాల్లో గెలిచిన కాంగ్రెస్ ను ఎలా అధికారంలోకి తేగలిగిందన్న విషయం అర్ధంకావటంలేదు. నిజానికి కాంగ్రెస్ తో పొత్తున్నది కాబట్టే సీపీఐ కొత్తగూడెంలో గెలిచిందన్నది వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ తో పొత్తులేకపోతే సీపీఐకి కొత్తగూడెంలో కూడా గెలిచేంత సీన్ లేదన్నది వాస్తవం. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఊపు సీపీఐకి కలిసొచ్చి కొత్తగూడెంలో గెలిచింది. ఇక్కడ సీపీఐ పోటీచేయకపోతే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే గెలిచేదనటంలో సందేహంలేదు.
కాంగ్రెస్ ను కాదని విడిగా పోటీచేసిన సీపీఎం వ్యవహారం ఏమైందో అందరు చూసిందే. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసిన సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు వచ్చిన ఓట్లు సమారు 4 వేలు మాత్రమే. పోటీచేసిన 19 నియోజకవర్గాల్లో ఎక్కడా డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయింది. సీపీఎంతో కలిసి పోటీచేసుంటే సీపీఐ పరిస్ధితి కూడా దాదాపు ఇలాగే ఉండేదే అనటంలో సందేహంలేదు. అలాంటిది తలతిక్కగా మాట్లాడటంలో తనను మించిన వాళ్ళు లేరని నారాయణ మరోసారి నిరూపించుకున్నారు.
తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్-సీపీఐ కలిసి పోటీచేయాలని అనుకుంటున్న సమయంలో ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నారాయణకు అర్ధంకావటంలేదు. ఇదే విషయాన్ని పదేపదే మాట్లాడి కాంగ్రెస్ నేతలకు చిర్రెత్తించటం కన్నా మరే ఉపయోగమూ ఉండదని నారాయణ గ్రహిస్తే మంచిది. మొదటినుండి నారాయణ మాటలు ఇలాగే ఉంటున్నాయి. గ్రౌండ్ లెవల్లో పూర్తిగా దెబ్బతినేసిన సీపీఐ సరైన సమయంలో ఒక సీటులో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. ఈ విషయానికి సంతోషించాల్సిన నారాయణ ఎదురు కాంగ్రెస్ పార్టీని పలుచన చేసేట్లు మాట్లాడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.