టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో లోకేష్ ను రైతులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ పై లోకేష్ నిప్పులు చెరిగారు. సెంటు పట్టా పేరుతో జగన్ 7 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ పెట్టే ప్రతి స్కీం వెనుక స్కామ్ ఉంటుందని ఆరోపించారు. జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలను తమ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులకే వైసీపీ నేతలు కట్టబెట్టారని విమర్శించారు.
ఇక, జగన్ ఇచ్చిన నివాసయోగ్యం కానీ స్థలాల్లో పేదలు ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదన్నారు లోకేష్. టీడీపీ- జనసేన ప్రభుత్వం రాగానే పేదలకు ఇళ్ల స్థలాలతోపాటు పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని లోకేష్ హామీనిచ్చారు. ఇక, గత ప్రభుత్వం నీరు-చెట్టు పథకం ద్వారా పంట కాలువలు, చెరువుల్లో పూడిక తీయించిందని, వైసీపీ ప్రభుత్వం ఆ విషయం పట్టించుకోలేదని లోకేష్ మండిపడ్డారు. గతంలో ఎరువులు, పురుగు మందులను, యంత్ర పరికరాలను రైతులకు సబ్సిడీపై ఇచ్చేవారని, జగన్ పాలనలో అవేమీ లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు, యలమంచిలి శివారులో అంగన్వాడీ వర్కర్లు లోకేష్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీనిచ్చారు. ఒకటో తేదీన పెన్షన్ ఇస్తామని రిటైర్డ్ ఉద్యోగులతో ముఖాముఖిలో లోకేష్ హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులను జగన్ వేధిస్తున్నారని, రివర్స్ ట్రీట్మెంట్ తో ప్రభుత్వ ఉద్యోగులను ముంచేశాడని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో మొదటి బాధితులు ప్రభుత్వ ఉద్యోగులేనని లోకేష్ విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్ర అప్పు 12 లక్షల కోట్లకు చేరిందని, ఏటా లక్ష కోట్లు వడ్డీ కట్టే పరిస్థితి ఉందని అన్నారు. ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని జగన్ అనారోగ్య శ్రీ కారణంగా మార్చేశారని ఎద్దేవా చేశారు. గ్రూప్ 1,2 అభ్యర్థుల వయోపరిమితిని 44కు పెంచాలని లోకేష్…జగన్ కు లేఖ రాశారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ విధానాన్ని ఏపీలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.