బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కాలుజారి పడటంతో ఆయన తుంటి కీలు మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్….సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ఆపరేషన్ అనంతరం చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ను పరామర్శించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తదితరులు వచ్చారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్… ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని, తనను పరామర్శించేందుకు యశోద ఆసుపత్రికి రావొద్దని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
త్వరలోనే సాధారణ స్థితికి చేరుకొని తానే ప్రజల మధ్యకు వస్తానని, అప్పటివరకు సంయమనం పాటించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తనకోసం వస్తున్న వందలాది ప్రజల వల్ల ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాదిమందికి కృతజ్ఞత తెలుపుతున్నానని గద్గద స్వరంతో కేసీఆర్ చేతులు జోడించి ప్రజలకు నమస్కరించారు. తనను చూసేందుకు వచ్చిన వారు ఇబ్బందిపడొద్దని, పేషెంట్లను కూడా ఇబ్బంది పెట్టొద్దని వీడియోలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ద్దేశించి కేసీఆర్ స్వయంగా మాట్లాడుతూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
కాగా, ఈ రోజు కేసీఆర్ను మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. కేసీఆర్ను మల్లు భట్టి విక్రమార్క, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పరామర్శించిన సంగతి తెలిసిందే.
వాకర్ సాయంతో నడుస్తున్న కేసీఆర్ కు…మరో ఐదారు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు.