చిన్న చిన్న విషయాలకు భారీ ఖర్చుతో కూడుకున్న నిర్ణయాలు తీసుకునే విషయంలో అధికారులు అనుసరిస్తున్న విధానం పెద్ద ఎత్తున విమర్శలకు గురి చేస్తోంది. తాజాగా అలాంటి ఒక ఉదంతం ఇప్పుడు చర్చగా మారింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కేవలం ఇరవై కిలోమీటర్ల ప్రయాణం కోసం 200 కి.మీ దూరం నుంచి హెలికాఫ్టర్ ను తెప్పిస్తున్న వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది.
అందునా.. హైరిస్కు ఏమైనా ఉందంటే.. అది కూడా లేదు. అలాంటప్పుడు కాస్తంత దూరానికి హెలికాఫ్టర్ ను తెప్పించటం.. అది ల్యాండ్ అయ్యేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయటంతో పాటు.. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసేందుకు అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ నెల 19న కర్నూలుకు రానున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కర్నూలు ఎయిర్ పోర్టు నుంచి సభావేదిక వరకు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా హెలికాఫ్టర్ ను తెప్పించటం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నుంచి కర్నూలు పట్టణానికి వెళ్లటానికి 20 కి.మీ. కూడా లేదు.
ఎయిర్ పోర్టు ను అనుకునే జాతీయ రహదారి ఉంది. మధ్యలో నాలుగు కిలోమీటర్ల వరకు నాలుగు వరుసల జాతీయ రహదారి ఉన్నప్పుడు.. వాటి మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించే వీలున్నప్పుడు.. ఆ మాత్రం దూరం ప్రయాణానికి హెలికాఫ్టర్ ను తెప్పించాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. సీఎం వినియోగించేందుకు అవసరమైన హెలికాఫ్టర్ ను విజయవాడ లేదంటే హైదరాబాద్ నుంచి తెప్పించనున్నారు.
వాస్తవానికి.. ఎయిర్ పోర్టు నుంచి తాను పాల్గొనాల్సిన సభావేదిక మధ్య దూరం ఎక్కువగా ఉన్నా.. కొండలు.. గుట్టలు.. రహదారులు ఏ మాత్రం బాగోలేకున్నా.. లేదంటే భద్రతాపరమైన సమస్యలు ఉన్నా.. హెలికాఫ్టర్ వినియోగాన్ని అర్తం చేసుకోవచ్చు. సాఫీగా.. నేషనల్ హైవే మీద ప్రయాణించే వీలున్నా.. హెలికాఫ్టర్ వినియోగానికి మొగ్గు చూపుతూ అధికారులు తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురిచేస్తోంది.