ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను టిడిపి అధినేత చంద్రబాబు కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై మాజీ ఐఏఎస్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్ల జాబితా అంశంలో తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.
సిబ్బంది వ్యవహారం కూడా విమర్శలు పాలవుతుందని అన్నారు. లోపాల సవరణ జరగకుండానే ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేశారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దాల్సిన బాధ్యత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పై ఉందని గుర్తు చేశారు. ఇక, ప్రస్తుతం బూత్ లెవెల్ ఆఫీసర్ల పనితీరు కూడా సరిగా లేదని, గతంలో నిష్పాక్షికంగా వ్యవహరించిన బీఎల్వోలు ఇప్పుడు రాజకీయ పక్షాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఒకేసారి భారీ సంఖ్యలో ఓట్లను తొలగించకూడదన్న కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు అమలు కావడం లేదని వాపోయారు. ఇక, గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా సలహాదారులను ఈ ప్రభుత్వం నియమించుకుందని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని నిమ్మగడ్డ విమర్శలు గుప్పించారు.