“నాడు మీరు పోసిన ఊపిరి… నా చివరి శ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటుంది“ అని సీఎం రేవంత్ మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాజాగా ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యత్వానికి(ఎంపీ) రాజీనామా చేశారు. శుక్రవారం లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లాను స్వయంగా కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
అనంతరం.. శుక్రవారం పొద్దు పోయాక.. మల్కాజ్గిరి ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తన రాజకీయ ప్రస్థానంలో కొడంగల్‌కు ఎంతటి ప్రాధాన్యత ఉందో, మల్కాజ్‌గిరికి అంతే ప్రాధాన్యత ఉందన్నారు. తనను ఈ దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజ్గిరి ప్రజలదేనని తెలిపారు.
ఏ విశ్వాసంతో, ఏ అభిమానంతో మల్కాజ్గిరి ప్రజలు గెలిపించారో ఐదేళ్లు మీరు ఆశించిన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేశానని సీఎం రేవంత్ పేర్కొన్నారు. విస్తృత బాధ్యతల నేపథ్యంలో వ్యక్తిగతంగా కొన్ని సార్లు అనుకున్నంత సమయం ఇవ్వలేకపోయి ఉండొచ్చునని, అలాంటి సందర్భంలో నా పరిస్థితిని మీరు సహృదయంతో అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. “తల్లి తన బిడ్డను దేశ రక్షణ కోసం పంపినట్టు, నన్ను మీరు తెలంగాణ రక్షణ కోసం గెలిపించి పంపారు“ అని పేర్కొన్నారు.
ఇన్నాళ్లు ఎంపీగా బాధ్యతను త్రికరణ శుద్ధిగా నిర్వర్తించానని భావిస్తున్నానని రేవంత్ తెలిపారు. మల్కాజ్గిరి ప్రజలకు పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ఐదేళ్లే కాదు ఇక మీతో నా అనుబంధం.. నా గుండెల్లో మీ స్థానం శాశ్వతం అని తెలిపారు. మల్కాజ్ గిరికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. “నాడు మీరు పోసిన ఊపిరి… నా చివరి శ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటుంది“ అని సీఎం రేవంత్‌రెడ్డి మల్కాజ్ గిరి ప్రజలను ఉద్దేశించి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.