ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే లను, మంత్రులను, మాజీ మంత్రులను జనాలు ఏకేస్తున్నారు. ఇటు సోషల్ మీడియా నుంచి అటు.. సాధారణ ప్రజల నుంచి తిట్లవర్షం కురుస్తోంది. దీనికి కారణం.. మిచౌంగ్ తుఫాను రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేయగా.. ప్రజలు నానా తిప్పలు పడ్డారు. పడుతున్నారు. ఇక, రైతులు.. కంట కన్నీరు బదులు రక్తం కారుతోంది. కోటి ఆశలతో లక్షల రూపాయలు అప్పులు చేసి.. పండించిన పంటలు.. మొకాల్లోతు నీటిలో నానిపోయాయి.
ఇలాంటి సమయంలో వారికి మనోధైర్యం కల్పించాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. తీరిగ్గా ఇంద్ర భవనాలకే పరిమితం అయ్యారు. తుఫాను ఉవ్వెత్తున వచ్చినప్పుడు కనీసం ప్రజలను పలకరించే ప్రయత్నం కూడా చేయలేదు. తీరిగ్గా ఇప్పుడు తుఫాను వెలిసిన తర్వాత.. తగుదునమ్మా.. అంటూ.. పలకరింపులకు వచ్చారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రైతులు, ప్రజలు వారిని తీవ్రస్థాయిలో ఏకేస్తున్నారు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే సుచరితను ఆమె సొంత నియోజకవర్గంలోనే మహిళలు అడ్డుకున్నారు. కాకుమాను వరద ప్రాంతాలను పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే కారును కాకుమాను ఎస్సీ కాలనీ మహిళలు అడ్డుకున్నా రు. ఇళ్లలోకి నీరు వచ్చిందని కనీసం పట్టించుకున్న వారు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి స్థలాలు ఇవ్వలేదని, రహదారులు నిర్మించలేదని మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు.
స్థానిక వైసీపీ నేతలు, అధికారులు కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారో కూడా చెప్పలేదని మహిళలు ఆగ్రహించారు. ప్రతి వీధిలో ఎమ్మెల్యేకు మహిళలు సమస్యలను ఏకరువు పెట్టారు. అన్ని ఏర్పాటు చేపిస్తామని మహిళలకు చెప్పి ఎమ్మెల్యే సుచరిత అక్కడి నుంచి బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. ఇక, ఇదే పరిస్తితి హోం మంత్రి తానేటి వనితకు కూడా ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి కాన్వాయ్నురైతులు అడ్డుకున్నారు. కనీసం రైతులు ఉన్నారన్న స్పృహ ఉందా? అని ఆమెను ప్రశ్నించారు. దీంతో మంత్రి మొహం మాడిపోయింది.