తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతోపాటు పలువురు కాంగ్రెస్ కీలక నేతలు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్బీ స్టేడియం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు, ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్ళిన రేవంత్ రెడ్డి, వీహెచ్ వారికి స్వాగతం పలికారు.
భారీ భద్రత మధ్య శంషాబాద్ విమానాశ్రయం నుంచి హోటల్ తాజ్ కృష్ణకు వారు చేరుకున్నారు. ఇక, ప్రమాణస్వీకారానికి బయలుదేరే ముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని రేవంత్ రెడ్డి దర్శించుకోబోతున్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే ఎల్బీ స్టేడియం కి రేవంత్ వెళ్ళబోతున్నారట. ఇక, మార్గమధ్యంలో గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించబోతున్నారు. ఇక, గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నేరుగా ఎల్బీ స్టేడియానికి చేయడానికి తరలించబోతున్నారు.
ఈరోజు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారితోపాటు మంత్రులుగా శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే వీరికి ఏ పోర్టుఫోలియో కేటాయించాలి అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
రేవంత్ తో పాటు ప్రమాణ స్వీకారం చేయబోయే 11 మంది మంత్రుల జాబితాను ఇప్పటికే రాజ్ భవన్ లో గవర్నర్ కు అందజేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు, ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మారుస్తానని చెప్పిన రేవంత్ ఆ దిశగా తొలి అడుగు వేశారు. ప్రగతి భవన్ ముందున్న బారికేడ్లను తొలగించి అక్కడ అన్ని ఆంక్షలను ఎత్తివేశారు. ఇక, ప్రగతి భవన్ ముందున్న రోడ్డు పై బారికేడ్ల లోపల నుంచి కూడా వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతించారు. మరో రెండు రోజుల్లో అక్కడున్న బారికేడ్లను పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయని తెలుస్తోంది.