తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేత, ఎనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను అని రేవంత్ అనగానే ఎల్బీ స్టేడియం ఆయన అభిమానులు, కార్యకర్తల కేకలు, కేరింతలతో దద్దరిల్లిపోయింది. దైవ సాక్షిగా అంత:కరణశుద్ధితో రేవంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కతో తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆ వెంటనే మంత్రులుగా సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం కాకుండా మొత్తం 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ లతో పాటు పలువురు కాంగ్రెస్ కీలక నేతలు హాజరయ్యారు.
మరోవైపు, తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెక్స్టైల్ శాఖా మంత్రిగా ప్రసాద్ కుమార్ పని చేశారు. రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా పేరున్న ప్రసాద్ కుమార్ కు స్పీకర్ పదవి దక్కింది. ఎస్సీ కోటాలో దామోదరకు మంత్రి పదవి దక్కడంతో ప్రసాద్ కు స్పీకర్ పదవిని అధిష్టానం అప్పగించింది. దీంతో, దళితులకు కాంగ్రెస్ పెద్దపీట వేసిందని ఆ వర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.