తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే, ఎప్పటిలాగే సీఎం అభ్యర్థి ఎవరు అన్న విషయంలో జాప్యం జరుగుతుండడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కలవరపాటుకు గురవుతున్నాయి. ఇలా జాప్యం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీని మిగతా పార్టీలు చులకనగా చూస్తూ హేళన చేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఢిల్లీకి చేరిన నేపథ్యంలో ఈ రోజైనా ఆ విషయం తేలిపోతుందా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే సీఎం అభ్యర్థి, సీఎల్పీ నేత ఎంపికపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు. ఈ రోజే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తామని ఖర్గే క్లారిటీనిచ్చారు. ముందుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు డీకే శివ కుమార్, మాణిక్ రావు ఠాగూర్ ల నివేదికలను పరిశీలిస్తామని చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకొని సీఎం అభ్యర్థి పేరును ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
వాస్తవానికి రేవంత్ రెడ్డి సీఎం కావడం దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది. అయితే, సీఎం పదవి రేసులో ఉన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను బుజ్జగించేందుకు అధిష్టానం ఇంత సమయం తీసుకుంటోందని తెలుస్తోంది. తమ పేర్లను కూడా సీఎం పదవి కోసం పరిశీలించాలని ఖర్గేను వారు కోరినట్లు తెలుస్తోంది. ఫలితాలు వెలువడిన రోజే భట్టి సీఎం పదవి రేసులో తాను కూడా ఉన్నానని మీడియా ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇక, రాహుల్ గాంధీతో కూడా భట్టి, ఉత్తమ్ భేటీ కాబోతున్నారని తెలుస్తోంది. అంతే కాదు, ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్..తన ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నారట. ఏది ఏమైనా..ఖర్గే చెప్పినట్లు సీఎం సీటు పంచాయతీ ఈరోజు సాయంత్రానికి తెగితే…ఆ పేరున్న సీల్డ్ కవర్ ను తీసుకొని డీకే శివ కుమార్ సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోబోతున్నారని తెలుస్తోంది.