స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఊరటనిచ్చింది. అమరావతి ఇన్నర్ రింగురోడ్డు అలైన్మెంట్, ఫైబర్ నెట్ కేసులలో చంద్రబాబుకు సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్లను జడ్జి తోసిపుచ్చారు. చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ పై ఉన్న సమయంలో దాఖలైన ఆ వారెంట్లపై నేడు విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఆ వారెంట్లను తోసిపుచ్చింది. చంద్రబాబు బెయిల్ పై ఉన్నారని, కాబట్టి ఆ వారెంట్లకు విచారణ అర్హత లేదని ఏసీబీ కోర్టు అభిప్రాయపడింది.
ఇక, ఈ నెల 7న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఓటర్ల జాబితాలో అవకతవకల గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. టీడీపీ ఎంపీలతో కలిసి సీఈసీని చంద్రబాబు కలిసి టీడీపీ సానుభూతిపరుల ఓట్లను అధికార పార్టీ తొలగిస్తోందని ఫిర్యాదు చేయబోతున్నారు. ఈ నెల 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఏపీలో పర్యటించనుంది. అంతకు ముందే సీఈసీని కలవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.