తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తొలి అంకంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. రాష్ట్ర వ్యా ప్తంగా ఉద్యోగులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు.. వృద్ధులు.. ఈ పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. అయితే.. చిత్రంగా.. ఈ పోస్టల్ బ్యాలెట్ ఫలితం అంతా కూడా.. అధికార బీఆర్ ఎస్‌కు వ్యతిరేకంగా ఉండడం గమనార్హం. ఎక్కడైనా సరే.. చివరకు మాజీ సీఎం కేసీఆర్ గెలుపు గుర్రం ఎక్కిన గజ్వేల్‌లో కూడా.. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది.
ఈ ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. మరి దీనికి కారణం ఏంటి? అంటే.. ఉద్యోగుల ఆగ్రహమే. వారంతా ఎక్కడా బయట పడలేదు. చాలా వెయిట్ చేశారు. సమయం కోసం వేచి ఉన్నారు. సమయం వచ్చింది.. తమ తడాకా చూపించారు. 1వ తేదీన కాదు.. కనీసం 5వ తేదీ అయినా.. జీతాలు ఇవ్వాలన్న తమ విజ్ఞప్తులను కేసీఆర్ పట్టించుకోలేదు. ఇక, డీఏ బకాయిలు.. పెండింగులో పెట్టి.. నానా తిప్పలు పెట్టారు. నిరసనలు చేయడానికి వీల్లేదన్నారు.
ఆర్థికంగా ప్రోత్సాహాలను ఆపేశారు. ఇక, కీలకమైన సీపీఎస్ విధానాన్ని అసలు పట్టించుకోలేదు. దీంతో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యోగులుసైలెంట్గా ఓటెత్తారు. ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఇక్కడ ఉద్యోగులు బహిరంగ ఉద్యమాలే చేస్తున్నారు. సేమ్ సమస్యలపైనే పోరాటాలకు సైతం దిగుతున్నారు. అంతేకాదు… తెలంగాణలో లేని విధానం.. ఏంటంటే.. ఏపీలో ఉద్యోగులు, వారి సంఘాల నేతలపై కేసులు పెట్టడం. అంతేకాదు.. నోరు విప్పితే అరెస్టులు చేయించడం.
ఈ పరిణామాలను గమనిస్తే.. తెలంగాణలో కంటే.. ఈ దఫా పోస్టల్ బ్యాలెట్.. ఏపీలో మరింత ఎక్కువగా అధికార పార్టీకి వ్యతిరేకత తీసుకువస్తుందని అంటున్నారు పరిశీలకులు. సైలెంట్‌గా ఉన్న తెలంగాణలోనే ఉద్యోగులు తమ తఢాకా చూపిస్తే.. ఇప్పటికే రోడ్లపైకి వచ్చి. తమ ఆవేదనను వెల్లడించిన ఏపీలో ఉద్యోగులు అస్సలు ఊరుకోబరని.. బ్యాలెట్లు బద్దలు అవుతాయని చెబుతున్నారు. మరి ఈ ముందస్తుహెచ్చరికల నుంచి వైసీపీ ఏమేరకు పాఠం నేర్చుకుంటుందో చూడాలి.