నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో విశేషాలకు కొదవ లేదు. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓడిపోవటం.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీతో గెలుపొందటం తెలిసిందే. ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చింతనే.. రాజ్ భవన్ కు వెళ్లి మర్యాదపూర్వకంగా గవర్నర్ ను కలిసి.. రాజీనామా ఇవ్వాల్సిన స్థానే.. కేసీఆర్ తన మనిషిని ఒకరిని రాజ్ భవన్ కు పంపి.. వారితో రాజీనామా లేఖను గవర్నర్ కు అందేలా చేయటం తెలిసిందే.
కట్ చేస్తే.. ప్రగతిభవన్ నుంచి పర్సనల్ సెక్యూరిటీని వదిలేసి.. ప్రైవేటు వాహనంలో ఎర్రవెల్లి క్షేత్రానికి వెళ్లిపోయారు కేసీఆర్. దీంతో.. ఆయన అందుబాటులోకి వస్తారా? లేదా? అన్న సందేహాలు కలిగాయి. కట్ చేస్తే.. కొన్ని గంటల వ్యవధిలోనే పార్టీలో గెలుపొందిన ఎమ్మెల్యేలతో పాటు.. ఓడిన పలువురిని ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కలవటం.. తన పక్క సీటును స్పీకర్ గా వ్యవహరించిన పోచారంను కూర్చోబెట్టుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.
కేసీఆర్ సారు అధికారంలో ఉన్న వేళలో.. ఫాంహౌస్ లోపల నిర్వహించే సమావేశాలకు సంబంధించిన ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో బయటకు రాని పరిస్థితి. అసలు ఫాంహౌస్ ఎలా ఉంటుంది? దాని లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుంది? ఎలా దాన్ని సిద్ధం చేశారన్న ప్రశ్నలే తప్పించి సమాధానాలకు కనీసం ఫోటోలు కూడా బయటకు రాని పరిస్థితి. తాజాగా ఆ కొరతను తీరుస్తూ.. నిమిషానికి ఒకట్రెండు సెకన్లు అదనంగా ఉండే వీడియో ఒకటి బయటకు రావటం.. వైరల్ కావటం జరిగిపోయింది. ఎందుకిలా? అంటే.. ఈ వీడియోను వైరల్ చేయటమే ఉద్దేశంగా చెబుతున్నారు.
కారణం.. ఓటమి నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ తీవ్రమైన వేదనతో.. ఫస్ట్రేషన్ తో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాటిల్లో నిజం లేదని చెప్పటంతో పాటు.. సోషల్ మీడియాలో ఆదివారం రాత్రి నడుస్తున్నచర్చకు ఫుల్ స్టాప్ పెట్టటం కూడా తాజా వీడియో లక్ష్యమని చెబుతున్నారు. ఈ కారణంతోనే కేసీఆర్ టీం.. ఎప్పుడూ లేని విధంగా ఫాంహౌస్ లోపలి వీడియోను బయటకు విడుదల చేశారని చెబుతున్నారు.
ఈ వీడియోలో గులాబీ పార్టీకి చెందిన మంత్రులుగా పని చేసిన వారు.. తాజా ఎన్నికల్లో విజయం సాధించినోళ్లతో పాటు.. ఓడిన కొందరు.. నేతలు కాకున్నా పార్టీలో మొదట్నించి పని చేస్తున్న వారు సైతం సదరు వీడియోలో కనిపిస్తున్నారు. ఇదంతా చూసినప్పుడు కేసీఆర్ ఆత్మవిశ్వాసాన్ని తెలంగాణ ప్రజలకు చాటి చెప్పే ఉద్దేశమే లక్ష్యంగా వీడియోను బయటకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా ఇవన్నీ ముఖ్యాంశాలు అయితే.. ఇంతకాలం ఫాంహౌస్ లోపలి భాగాన్ని చూడని ఎందరికో తాజా వీడియోతో అసలెలా ఉంటుందన్న దానిపై సందేహాలు తొలిగిపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.