తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తొలి అధికారిక గెలుపు వివరాలు వెల్లడయ్యాయి. సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల్లో అధిక్యతను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో తొలి స్థానం కాంగ్రెస్ ఖాతాలో పడింది. దీంతో.. కాంగ్రెస్ బోణీ కొట్టినట్లైంది. అశ్వారావుపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ తమ సమీప బీజేపీ అభ్యర్థి మీద గెలుపొందారు.
ఓట్ల లెక్కింపు మొదలై నాటి నుంచి తెలంగాణలో అధిక్యతను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్.. తొలి స్థానాన్ని సొంతం చేసుకోవటంలో ముందుంది. ఖమ్మంలో ఒక్క స్థానంలోనూ అధికార బీఆర్ఎస్ గెలవకుండా చూస్తానంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి సవాలు విసిరిన చందంగా.. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్ని చూస్తే.. ఖమ్మం జిల్లా మొత్తంలో కాంగ్రెస్ హవా నడుస్తోంది.
దీనికి తగ్గట్లే ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ విజయం సాధించారు. ఆయన ఏకంగా 28,358 ఓట్ల మెజార్టీతో గెలుపొందటం చూస్తే.. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన అధిక్యతను ప్రదర్శిస్తున్నట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర పార్టీకి వరంగా మారినట్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అవినీతి.. అహంకారం.. నియంత తరహాలో పాలనకు తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్న ఆయన.. సరైన సమయం కోసం ప్రజలు వేచి చూసి తీర్పు ఇచ్చినట్లుగా వ్యాఖ్యానించారు.