టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభమై న విషయం తెలిసిందే. అయితే.. గతానికి భిన్నంగా ఇప్పుడు మరింతగా ఈ యాత్రకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు, యువత భారీ సంఖ్యలో యాత్రలో పాల్గొంటున్నారు. నారా లోకేష్కుమద్దతుగా మాట్లాడుతున్నారు. అదేసమయంలో వారి సమస్యలు కూడా చెబుతున్నారు. ఆయా సమస్యలపై స్పందిస్తున్న నారా లోకేష్ తాము అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.
మొత్తంగా నారా లోకేష్ పాదయాత్రకు అనూహ్యమైన స్పందన అయితే లభిస్తోంది. అయితే.. ఈ స్పంద నే ఇప్పుడు వైసీపీలో కాక పుట్టిస్తోంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన యాత్ర విషయంలో వైసీపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. యాత్రను అడ్డుకునేందుకు జీవో 1 తీసుకువచ్చింది. అయితే.. దీనిని హైకోర్టు కొట్టేసింది. ఇక, ఆ తర్వాత.. పోలీసులను ప్రయోగించి మైకులు లాగేశారు. ప్రచారం చేసే వాహనాలను కూడా ఎత్తకెళ్లారు. అయినప్పటికీ.. నారా లోకేష్ తన పాదయాత్రను ముందుకు సాగించారు.
ఇక, చంద్రబాబు అరెస్టు, జైలు తర్వాత.. యాత్రకు కొంత బ్రేక్ వచ్చింది. అయితే.. ఇక, యాత్ర ఆగిపో యిందని, ఇకపై ముందుకు సాగదని వైసీపీ నాయకులు భావించారు. ఇదే విషయాన్ని బయటకు కూడా చెప్పారు. అయితే.. యాత్ర మాత్రం కొంత విరామం తీసుకున్నా.. ఈ నెలలో ప్రారంభమైంది. తిరిగి ప్రారంభమైన యాత్రకు పెద్దగా స్పందన ఉండదని వైసీపీ నాయకులు అంచనా వేసుకున్నారు. అయితే..అ నూహ్యంగా నారలోకేష్కు రాజోలు నుంచి ఇతర ప్రాంతాల దాకా.. భారీ స్పందన లభించింది.
అడుగడుగునా.. మహిళలు, యువత ఆయనకు స్వాగతాలు పలుకుతున్నారు. అంతేకాదు.. తమ కష్టాలు కూడా చెబుతున్నారు. ఈ పరిణామాలే ఇప్పుడు వైసీపీ ని అంతర్గత మథనంలో పడేశాయి. తాము అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నా.. ఎందుకు యాత్ర సక్సెస్ అవుతోంది? అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? అని వైసీపీ అధిష్టానం ఆరా తీస్తోంది. క్షేత్రస్థాయిలో నాయకులు ఏం చేస్తున్నారో చెప్పాలని.. కూడా ప్రశ్నించడం గమనార్హం.