తెలంగాణ ఎగ్జిట్ పోల్స్‌పై కేటీఆర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 2018లో కూడా ఇలాగే వచ్చాయని, కానీ, తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ అన్నారు. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు అని తేలితే ఏం చేస్తారు అని సర్వే సంస్థలను కేటీఆర్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ కామెంట్లకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, తమ పార్టీ నేతలు ఈ రోజు నుంచి సంబరాలు చేసుకోవచ్చని అన్నారు. అధికారం శాశ్వతమని కేసీఆర్ నమ్మారని, బీఆర్ఎస్ ది మేకపోతు గాంభీర్యం అని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ తప్పయితే డిసెంబర్ 3న క్షమాపణ చెప్తారా? అని కేటీఆర్ ను ఉద్దేశించి సవాల్ చేశారు. ప్రజలంటే బీఆర్ఎస్ నేతలకు చిన్నచూపని అన్నారు.
కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయిందని, కేసీఆర్ మాదిరిగా కాంగ్రెస్ నేతలు నిరంకుశంగా వ్యవహరించబోరని అన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ నియోజకవర్గం మారారని, బీఆర్ఎస్ కు 25కి మించి ఒక్క సీటు కూడా రాదని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలు చూపించే స్వేచ్ఛ మీడియాకు ఉంటుందని, విపక్షాలకు విలువ ఉంటుందని హామీ ఇచ్చారు.
ఒక్క ఎగ్జిట్ పోల్ సర్వే కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా రాలేదని రేవంత్ అన్నారు. కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించబోతున్నారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారని కితాబిచ్చారు. శ్రీకాంతాచారి త్యాగానికి ఎన్నికల తేదీకి ఒక సంబంధం ఉందని, శ్రీకాంతాచారి ప్రాణత్యాగం ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లిందని చెప్పారు.
తాము పాలకులు కాదని, ప్రజా సేవకులమని చెప్పారు. కేటీఆర్ కూడా త్వరలో అమెరికా వెళ్తారని రేవంత్ సెటైర్లు వేశారు. కేసీఆర్ కుటుంబం ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అన్నారు. అధిష్ఠానం సూచన ప్రకారం సీఎల్పీ సమావేశం, ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరామ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు.