టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సీఈఓ, ఈసీఐలకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి తెలిసే ఫేక్ వీడియోలు బయటకు వచ్చాయని బీఆర్ఎస్ లీగల్ సెల్ హెడ్ సోమా భరత్ ఆరోపించారు. ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించేలా రేవంత్ వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు. సైలెంట్ పీరియడ్‌ను రేవంత్ ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు చట్టాన్ని ఉల్లంఘించినట్లే అని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సీఈఓ, ఈసీఐకి ఫిర్యాదు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీలో నేరాలు చేసే నాయకులు ఎక్కువగా ఉన్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే పోలింగ్ సరళి, ఘర్షణలపై సీఈఓ వికాస్ రాజ్ స్పందించారు. చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతగా సాగుతోందని చెప్పారు. కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో కొత్తవి ఏర్పాటు చేశామన్నారు. అర్బన్ ఏరియాల్లో పోలింగ్ శాతం పెరగాల్సి ఉందని చెప్పారు. గొడవలు జరిగిన ప్రతి కంప్లైంట్స్‌పై డీఈఓను రిపోర్ట్ అడిగామని చెప్పారు.
ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కంప్లైంట్స్ వచ్చాయని అన్నారు. అయితే, డీఈఓ రిపోర్ట్ ఆధారంగా కోడ్ ఉల్లంఘించినట్లు తెలిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. కవిత వ్యాఖ్యలపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు అయిందన్నారు.
కాగా, ఎగ్జిట్ పోల్ ఫలితాల సమయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ మార్చింది. గురువారం సాయంత్రం 5.30 గంటల నుంచే ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రసారం చేయవచ్చునని సీఈసీ తెలిపింది. గతంలో ఆదేశాల ప్రకారం సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలపై నిషేదం విధించింది.