రాజకీయ నాయకులకు ప్రచార యావ ఉంటుంది. ఇక, అధికారంలో ఉంటే.. మరింతగా ప్రచారం కోరు కుంటారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని కూడా భావిస్తారు. ఈ క్రమంలో పలు పథకా లకు వారి వారి పేర్లు పెట్టుకోవడం.. పార్టీల పేర్లు తగిలించడం కూడా.. చూస్తేనే ఉన్నాం. అయితే.. ఏపీ సీఎం జగన్ వీటితో పాటు.. మరో అడుగు ముందుకు వేశారు. పథకాలకు, కార్యక్రమాలకే కాదు.. ఇతర వాటికికూడా ఆయన బొమ్మను తగిలించేస్తున్నారు.
ఇప్పటికే `మా నమ్మకం నువ్వే జగన్` పేరుతో ఇంటింటికీస్టిక్కర్లు అంటించారు. ఇక, తాజాగా ఆరోగ్య శ్రీపథకంలో నేత్రాలను పరీక్ష చేసి.. చిన్నారులకు ఇచ్చే కళ్లజోళ్లపైనా.. సీఎం జగన్తన బొమ్మ వేసేసుకున్నారు. ఇటీవల స్కూళ్లలో చిన్నారులకు కంటి వెలుగు పథకంలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పలు జిల్లాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో అవసరమైన బాలబాలికలకు తాజాగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు.
కళ్లజోడు పెట్టుకునే బాక్స్ మీద సీఎం జగన్ బొమ్మతోపాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ఫొటోలు పార్టీ రంగులతో ప్రచురించారు. ప్రచారం కోసం పిల్లలను సైతం వదలడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇదిలావుంటే, మరోవైపు సచివాలయాలు, గ్రామాలు, మండలాల వారీగా ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా పోటీలకు సంబంధించిన సామగ్రిని అధికారులు గ్రామాలకు సరఫరా చేశారు.
అయితే.. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ టెన్నీకాయిట్ పోటీలకు సంబంధించిన బాల్స్, ఇతర క్రీడా పరికరాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్రాలు అతికించారు. డిసెంబరు 15 నుంచి 20 వరకూ సచివాలయాలు, గ్రామస్థాయిల్లో ఆటల పోటీలు నిర్వహించాలని, మండల స్థాయిలో డిసెంబరు 21 నుంచి జనవరి 4లోగా పోటీలు ముగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. అయితే.. ప్రతి దానిపైనా సీఎం జగన్ బొమ్మ ఉండడం అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.