టీడీపీ పాలక మండలిపై, టీటీడీ అధికారులపై ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు గతంలో పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ తిరుమల వెంకన్నను దర్శించుకున్న నేపథ్యంలో తాజాగా మరోసారి ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. మోడీని ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో పెట్టిన పోస్ట్ పెను దుమారం రేపుతోంది. తిరుమల శ్రీవారి ఆలయ పరిపాలనను హిందూయేతర అధికారి, రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా నాశనం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
సనాతన ఆచారాలు, టీటీడీ పరిధిలోని పురాతన నిర్మాణాల ధ్వంసం సాగుతోందని, తిరుమలను వాటి నుంచి రక్షించి హిందూ రాష్ట్రంగా అత్యవసరంగా ప్రకటించాలని కోరారు. ఆ తర్వాత రమణ దీక్షితులుపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ముందుగా రమణ దీక్షితులుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెట్టారు. దీంతో, రమణ దీక్షితులు తన పోస్ట్‌ను తొలగించారు.
వాస్తవానికి, సీఎం వైఎస్ జగన్ కు రమణ దీక్షితులు అనుకూలంగా ఉండేవారు. కానీ, అనూహ్యంగా కొంతకాలంగా టీటీడీలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయంటూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. వంశపారంపర్య అర్చక వ్యవస్థ నివేదికపై జగన్ స్పందించకపోవడంతోనే ఆయన రెబల్ గా మారారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏకంగా మోడీ దృష్టికి టీటీడీ వ్యవహారాన్ని రమణ దీక్షితులు తీసుకువెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. మరి, ఈ వ్యవహారంపై జగన్, వైసీపీ నేతల కౌంటర్ ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.