ఇవేంటి అనుకుంటున్నారా? ఏ అరాచక శక్తుల మీదో పెట్టిన కేసులు అనుకుంటున్నారా? లేక.. దోపిడీ ముఠాపై పెట్టిన కేసులని లెక్కలేసుకుంటున్నారా? అవేవీ కాదు.. అటు మోడీ సర్కారు, ఇటు వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్షాల కీలక నేతలపై నమోదు చేసిన కేసులు. ఆ వివరాలను తాజాగా యాదృచ్ఛి కంగా.. ఆయా నేతలే వెల్లడించడం గమనార్హం. వీరిలో ఒకరు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, రెండో వారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, మూడో నాయకుడు టీడీపీ యువ నేత నారా లోకేష్.
ఈ ముగ్గురు కూడా.. కేవలం కొద్ది గంటల గ్యాప్‌లోనే తమపై ప్రభుత్వాలు నమోదు చేసిన కేసుల సంఖ్యను వెల్లడించడం గమనార్హం. ఆదివారం.. తెలంగాణలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. పనిలో పనిగా.. తనపై మోడీ సర్కారు పెట్టిన కేసుల జాబితాను వెల్లడించారు. “ఇప్పటి వరకు నాపై 26 కేసులు పెట్టారు. ఈ దేశంలో నన్ను దోషిగా చూపించాలని ప్రయత్నించారు. నన్ను జైలు పాల్జేసి.. పార్టీని లేకుండా చేయాలని అనుకున్నారు. కానీ, ఇది ప్రజల పార్టీ. నేను ప్రజానేతను“ అని రాహుల్ నిప్పులు చెరిగారు.
కట్ చేస్తే.. సోమవారం ఉదయం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా.. ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తనపై మోడీ సర్కారు హయాంలో ఏకంగా 250 కేసులు పెట్టారని చెప్పారు. అంతేకాదు.. తనను రేపో మాపో.. జైలుకు తరలించి.. బెయిల్ కూడా రాకుండా.. అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం కోసం చూస్తున్నారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. “నన్ను తరిమేయాలి. జైల్లో పెట్టాలి. కుదిరితే బెయిల్ కూడా రాకుండా చూడాలి. ఇప్పటికి 250 కేసులు పెట్టారు. ఏమైనా చేయండి. నేను ప్రజలకోసం భరిస్తా“ అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
ఇక, తాజాగా సోమవారం.. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో నిర్వహించిన యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఏపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. తనపై ఏపీ సీఐడీ పోలీసులు ఆరు కేసులు పెట్టారని చెప్పారు. తనను కూడా జైలుకు పంపించి.. యువగళం పాదయాత్రను నిలిపివేయడం ద్వారా.. టీడీపీశ్రేణుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయాలని చూశారని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా దేశంలోనే కీలక నేతలుగా ఉన్న ఈ ముగ్గురు .. కొన్నిగంటల వ్యవధిలోనే తమపై కేసుల వివరాలు వెల్లడించడం ఆసక్తిగా మారింది.