తెలంగాణ ఎన్నికల ప్రచారం పతాక స్థాయిలో నడుస్తున్న టైంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు రైతు బంధు డబ్బలు రైతుల అకౌంట్లలో పడే అవకాశం ఉండటంతో అది ఎన్నికల్లో తమకెంతో ప్రయోజనం చేకూరుస్తుందని అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎంతో ఉత్సాహంగా ఉండగా.. ఎన్నికల కమిషన్ ఆ ఉత్సాహంపై నీళ్లు చల్లింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు.. ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న ఈ పథకాన్ని తాత్కాలికంగా ఆపాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు ఆదేశాల్లో.. హరీష్ రావు ఎన్నికల ప్రసంగాన్ని అధికారులు ఉటంకించడం విశేషం. ఇటీవల ఎన్నికల ప్రచార సభలో హరీష్ రావు మాట్లాడుతూ.. రైతు బంధు ఆపాలని కాంగ్రెస్ నాయకులు ఎంత ప్రయత్నించినా.. ఎన్నికల కమిషన్ ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. మంగళవారం ఉదయం డబ్బులు పడతాయని.. ఇప్పటికే పింఛను డబ్బులు తీసుకుని సంతోషంగా ఉన్న ప్రజలు.. ఈ డబ్బులు కూడా తీసుకుని కేసీఆర్ను పెద్ద కొడుకులా భావిస్తారని.. అది ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రయోజనం చేకూరుస్తుందని కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఈ వీడియోను అనుసరించే ఈసీ రైతు బంధు పథకాన్ని తాత్కాలికంగా ఆపింది. దీంతో అందరూ ఇప్పుడు హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్లో కూడా దీని గురించి పెద్ద చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో హరీష్ రావు ప్రసంగం తాలూకు వీడియో వైరల్ అయింది. ఐతే రైతు బంధు ఆగడానికి తనే కారణమని తనను అందరూ టార్గెట్ చేస్తున్నప్పటికీ హరీష్ రావు అస్సలు తగ్గలేదు. రైతు బంధు డబ్బులు ఆగాయని కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారని.. ఈసీకి ఫిర్యాదు చేసి మరీ పథకాన్ని ఆపించారని.. కానీ దీని వల్ల నష్టమేమీ లేదని.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి ఇంకో మూడు రోజులు ఆలస్యంగా డబ్బులు పడతాయని.. జనం కంగారు పడాల్సిన పని లేదని ఆయన తాజా ప్రసంగంలో అన్నారు.