తెలంగాణలోని కొల్హాపూర్ నియోజకవర్గానికి జరుగుతున్న శాసనసభ ఎన్నికలు ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క ఆ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదలలో జాప్యానికి నిరసనగా అధికార బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బర్రెలక్క ఎన్నికల బరిలో దిగారు. దీంతో, ఆమెకు పలువురు రాజకీయ మేధావులు, న్యాయ నిపుణులు, విద్యార్థి సంఘ నాయకులు మద్దతు తెలుపుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా బర్రెలక్కకు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మద్దతు కూడా లభించింది. కొల్లాపూర్లో బర్రెలక్క తరఫున లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. శిరీష వంటి యువత రాజకీయాల్లోకి రావాలని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. దేశంలో పార్టీస్వామ్యం పోయి ప్రజాస్వామ్యం రావాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శిరీష వంటి వారి అవసరముందని అభిప్రాయపడ్డారు. శిరీష ఎమ్మెల్యే అయితే ముందుగా సంతోషించే వ్యక్తి తానే అన్నారు. శిరీష ఎందరికో రోల్ మోడల్ అని, మనం కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని కొల్హాపూర్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
యానాం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ రాజకీయ నాయకుడు మల్లాడి కృష్ణారావు కొల్హాపూర్ కు వస్తున్నారని అన్నారు. ఎన్నికలలో పోల్ మేనేజ్మెంట్ ముఖ్యమని, సోషల్ మీడియాని సమర్థవంతంగా ఉపయోగించుకొని శిరీష ఈ స్థాయికి వచ్చారని అన్నారు. శిరీషకు ఈల గుర్తు రావడం తనకు బాగా నచ్చిందని చెప్పారు. ఆ ఈల వేసి జనాన్ని జాగృతం చేయాలని పిలుపునిచ్చారు. శిరీషను అసెంబ్లీకి పంపిస్తే శాసన సభలో ఈల వేసి ప్రజా సమస్యలు వినిపిస్తుందని చెప్పారు.