ఏపీ సీఎం జగన్పై టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి భగ్గుమన్నారు. సీఎం జగన్ పాలనకు మూడు నెల్లలో ఎక్స్పెయిరీ డేట్ అయిపోతుందన్న ఆయన.. ఇక, టీడీపీ – జనసేన ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని చెప్పారు. తమ ప్రభుత్వం రాగానే ప్రస్తుత వైసీపీ సర్కారు అవినీతి, ఇసుక కుంభకోణాలపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. మరోవైపు జగన్ బెయిల్ రద్దు అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయని చెప్పారు.
జగన్.. దొంగ సొమ్ముతో వ్యవస్థల్ని ఇంకెంత కాలం మేనేజ్ చేస్తారని నారా లోకేష్ ప్రశ్నించారు. 10 ఏళ్లుగా కేసులు మేనేజ్ చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు కోర్టు నోటీసులతో జగన్ అండ్ కో పని అయిపోయింది. అవినీతి చక్రవర్తి జగన్.. ఇక 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకోవాలి’’ అని లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం జగన్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంతోపాటు సీబీఐని కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్.. సీఎం జగన్ను ఉద్దేశించి ఖైదీ దుస్తులు ఉతికించి పెట్టుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.