నవ్యాంధ్రలో పాలక పక్షానికి అధికార మదంతో కళ్లు నెత్తికెక్కినట్లు కనిపిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి.. వ్యవస్థలను మేనేజ్ చేసి.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంతో సంతృప్తి చెందడం లేదు. ఆయన హంతకుడన్న స్థాయిలో జగన్ అండ్ కో విషప్రచారానికి ఒడిగడుతోంది. ఆయన బయటకు వస్తే వైసీపీ రెండోసారి అధికారంలోకి రాదని అర్థమైనట్లు ఉంది. అందుకే ఆయన్ను లోపల వేసి.. అనారోగ్యంతో అక్కడే చనిపోవాలని గట్టిగా కోరుకుంటోంది. చర్మవ్యాధితో బాధపడుతున్న చంద్రబాబుకు జైలులో ఏసీ పెట్టేందుకు నిరాకరించడమే దీనికి కారణం. జైలు సూపరింటెండెంట్ విచక్షణతో ఏసీ బిగించడం పెద్ద పనేమీ కాదు. ఆయన్ను సెలవుపై పంపించి.. ఇన్చార్జి సూపరింటెండెంట్‌ను ముందుపెట్టి జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ నాటకాలాడుతున్నారు రాష్ట్రప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల మంత్రి.
పైగా హోం శాఖ ఆయన చెప్పుచేతల్లోనే ఉంటుంది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్లుగా.. ఈయన చెప్పనిదే పోలీసులు రాష్ట్రంలో ఎవరిని అరెస్టు చేయరు. రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడి.. ఆర్థిక నేరాభియోగాలపై 16 నెలలు జైలులో ఉన్న జగన్ కళ్లలో ఆనందం చూడడానికి ఈయన ఎంతకైనా తెగిస్తారు. ఈనాడు, ఉదయం దినపత్రిల్లో జర్నలిస్టుగా పనిచేసి.. ఆనక మైన్స్ కంపెనీలు పెట్టుకుని.. వైఎస్ అధికారంలోకి వచ్చాక వాటన్నిటినీ జగన్‌కు కట్టబెట్టి.. ఆయన వెంటే తిరుగుతున్న సజ్జల.. జగన్‌కు కళ్లు.. చెవులు.. నోరు కూడా. విద్యావంతుడైన ఈయనకు విజ్ఞత, సంస్కారం లోపించాయి. ఉచ్చనీచాలు మరచి మాట్లాడుతున్నారు. ఓపక్క న్యాయవ్యవస్థనే తమకు అనుకూలంగా మేనేజ్ చేసుకోవడాన్ని ప్రపంచం మొత్తం కళ్లప్పగించి చూస్తోంది. అధికార పక్షం కోరుకుంటున్న రీతిలో కొన్ని తీర్పులూ వస్తున్నాయి.
లేని నేరానికి ఏవేవో సెక్షన్లు మోపి కోర్టును తప్పుదోవ పట్టించి రిమాండ్‌కు పంపేలా చేయడం వ్యవస్థను మేనేజ్ చేయడం అవుతుందా.. దేశంలో ఎక్కడా లేని విధంగా పనికిమాలిన కేసులో నలభై రోజులవుతున్నా బెయిల్ పొందలేక జైల్లో కునారిల్లడం మేనేజ్ చేయడం అవుతుందా..? అవినీతి నిరోధక చట్టం 17ఏ కింద గవర్నర్ అనుమతి తీసుకోనిదే చంద్రబాబుపై కేసు పెట్టడానికి వీల్లేదు. దర్యాప్తు చేయడానికీ అవకాశం లేదు. ఇది తెలిసినా ఆయన్ను రిమాండ్‌కు ఎలా పంపగలిగారు? ఇదే అంశంలో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పను అవినీతి కేసు నుంచి బయటపడేసిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ.. చంద్రబాబును అరెస్టు చేయడం సబబేనని పరస్పర విరుద్ధంగా వాదనలు వినిపిస్తున్నా.. కోర్టులు మౌనంగా ఆలకిస్తున్నాయంటే.. ఎవరి పలుకుబడి పనిచేస్తోంది? ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యాయని జగన్ అండ్ కోకు తెలిసిపోయింది. అందుకే బాబుపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు.
ఆయన అనారోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంటే.. ర్యాషెస్ వస్తే ప్రాణాంతకమా అని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబుకు ఇంటి భోజనమే అందుతోందని.. అందులోనే ఏమైనా కలుపుతున్నారేమో అని అన్నారు. మళ్లీ ఆయనే ఇంటి నుంచి వస్తున్న భోజనాన్ని కూడా తనిఖీ చేస్తున్నారని చెప్పారు. విజ్ఞత, సంస్కారం లోపించి దురహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. జైలు జీవితం ఎలా ఉంటుందో బాబుకు అర్థం కావాలని అన్నారంటే.. తమ నేత ఎదుర్కొన్న కష్టాలు ఆయనా ఎదుర్కోవాలన్న రాజకీయ ప్రతీకారంతోనే ఆయన్ను జైలుకు పంపించామని పరోక్షంగా అంగీకరించినట్లే! పైగా జైలు అత్తవారిల్లా అని ఎకసెక్కమాడారు.
వైద్యుల నివేదికలు తొక్కిపెట్టి..
నిజానికి బాబు అనారోగ్యం బయటకు రాకుండా ప్రభుత్వ వైద్యుల నివేదికలను జైళ్ల డీఐజీ రవికిరణ్ తొక్కిపెట్టారు. చంద్రబాబుకు ప్రభుత్వాస్పత్రిలో గానీ, ప్రైవేటు ఆస్పత్రిలో గానీ చికిత్స అందకుండా చేయడమే తమ ఉద్దేశమని ఆయన మాటల్లోనే తేలిపోయింది. ఆయన్నుచల్లని వాతావరణంలో ఉంచాలని వైద్యులు నివేదిక ఇచ్చారంటూనే.. కోర్టుకు పంపాం.. ఉన్నతాధికారులకు పంపాం.. వారి ఆదేశాల కోసంచూస్తున్నామని డొంకతిరుగుడుగా మాట్లాడారు. తీవ్రమైన చర్మ సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నట్టు అక్టోబరు 12వ తేదీనే బయటపడింది. మర్నాడు శుక్రవారం ఒక్కరోజు గడిపేస్తే.. శని, ఆదివారాలు కోర్టులకు సెలవులు ఉంటాయి కాబట్టి వైద్యుల నివేదికను అక్కడకు పంపకుండా ఆపేశారని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ప్రెస్‌మీట్ పెట్టి మరీ నమ్మించడానికి ప్రయత్నించారు. ప్రభుత్వ ఆస్పత్రికి పంపే అధికారం తనకు ఉన్నప్పటికీ కోర్టుపై నెపం మోపి తప్పించుకోవాలని చూశారు.
అటు వైద్యులను బెదిరించి నివేదికలు బయటకు ఇవ్వొద్దని హుకుం జారీచేసినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఎప్పుడైతే భువనేశ్వరి, లోకేశ్ ములాఖతకు వెళ్లి చంద్రబాబు పరిస్థితి చూసి వచ్చారో అప్పుడే ఆయనకేదో జరిగిపోతోందన్నది గుప్పుమంది. ఆయన ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని అర్థమైంది. టీడీపీ తరఫు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టును అత్యవసరంగా ఆశ్రయించడంతో 14వ తేదీ రాత్రి హుటాహుటిన విచారించిన న్యాయాధికారి.. చంద్రబాబు జైలు గదిలో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎట్టకేలకు 15వ తేదీన ఏసీ బిగించారు.
డీఐజీ రవికిరణ్ సామాన్యుడు కాదు.. ఈయన అనంతపురం జైలు సూపరింటెండెంట్‌గా ఉన్నప్పుడే.. పరిటాల రవి హత్య కేసు నిందితుడు మొద్దుశ్రీను హత్యకు గురయ్యాడు. మల్లెల ఓంప్రకాశ్ డంబెల్‌తో మోది మొద్దుశ్రీనును చంపాడు. అనంతరం విశాఖ సెంట్రల్ జైలులో అతడు కూడా అనారోగ్యంతో మరణించాడు. మొద్దు శ్రీను హత్యకు రవికిరణ్ సహకరించాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. నాటి వైఎస్ ప్రభుత్వం రక్షించింది. జగన్ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈయనకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు జైళ్ల శాఖ కోస్తా జిల్లాల డీఐజీగా.. రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ఎలాంటి సౌకర్యాలూ అందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ జగన్ సేవలో తరిస్తున్నారు.
వారు చెప్పినట్లే చేయాలి..
కోర్టును బెయిల్ కోరకుండా.. కేసును కొట్టివేయాలని చంద్రబాబు పిటిషన్ వేస్తారని జగన్ అండ్ కో ఊహించలేదు. హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసినా ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్తారని అనుకోలేదు. విచారణ జరుపుతున్న ధర్మాసనం ఆయనకు 17ఏ వర్తిస్తుందని అర్థమవుతోందని వ్యాఖ్యానించడంతో స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టివేత ఖాయమని ఆందోళన చెందుతున్నారు. అందుకే రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్‌నెట్ కేసుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేశారు. వాటిలోనూ ఆయనకు బెయిల్ రావడంతో.. ఇక జైల్లో ఎక్కువ నాళ్లు ఉంచలేమన్న అక్కసుతోనే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. సాంకేతిక కారణాలు చూపి కోర్టుల నుంచి తప్పించుకోవడం చంద్రబాబుకు అలవాటేనని సజ్జల సెలవిచ్చారు. మరి అక్రమాస్తుల కేసుల్లో జగన్ పదేళ్లుగా బెయిల్‌పై బయటే ఉన్నారు. ప్రతి కేసులోనూ డిశ్చార్జి పిటిషన్లు వేస్తూ సాగదీస్తున్నారు. మరి దీనినేమంటారు?