ఏపీ అధికార పార్టీ వైసీపీకి ముప్పేట సమస్యలు ముసురుకున్నాయా? 2024 ఎన్నికల ముందు.. వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోందా? రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రధాన ప్రతిపక్షాలు పోరుకు రెడీ అయ్యా యి. సమస్యలపై దుమ్మురేగేలా ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు.. ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, నిరుద్యోగులు ఉద్యమించేందుకు డెడ్లైన్లు పెట్టేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏపీలో ఏం జరుగుతోందనే పరిణామాలు ఆసక్తిగా మారాయి.
రాజకీయ వ్యూహాలు
ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ-జనసేన-బీజేపీలు ఇప్పటికే వైసీపీపై యుద్ధం ప్రకటించాయి. ఒకవైపు టీడీపీ-జనసేన మిత్రపక్షంగా మారి.. వివిధ కార్యక్రమాలపై ప్రజల్లో పోరాటానికి రెడీఅయ్యాయి. ఇప్పటికే రోడ్ల దుస్థితిపై ఒక దశ పోరాటం చేపట్టిన ఈ ఇరు పార్టీ లనాయకులు.. వచ్చే రెండు మూడు రోజుల్లో మరిన్ని కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిసెంబరు 1 నుంచి మళ్లీ ప్రజల్లోకి వచ్చేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.
అదేసమయంలో ఈ నెల 27 నుంచి టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ కూడా ప్రజల్లోకి వస్తున్నారు. యువగళం పాదయాత్రను ఆ రోజు నుంచి ఆయన తిరిగి ప్రారంభించనున్నారు. ఇది కూడా వేడి పుట్టించేస్థాయిలో జరగనుంది. అక్రమ కేసుల, ఎస్సీ, ఎస్టీలపై దాడులు.. టీడీపీ నాయకుల నిర్బంధం.. ప్రతిపక్షాల గొంతు నులమడం వంటివాటిని ప్రధానంగా చేసుకుని ఈ యాత్రలు చేపట్టనున్నారు.
ఇక, బీజేపీ ఇప్పటికే ఇసుక, మద్యం అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది.రాబోయే రోజుల్లో ఈ పోరును మరింత తీవ్రతరం చేసేందుకు బీజేపీ రెడీ అయింది. అదేసమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిసెంబరు రెండో వారం నుంచి వారాహి యాత్రకు రెడీ అవుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 26 జిల్లాల్లోనూ ఆయన పర్యటన సాగనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల దూకుడు ఇప్పటికి మించి ఉంటుందని చర్చ సాగుతోంది.
ఉద్యోగులు-నిరుద్యోగులు
ఇదిలావుంటే, రాజకీయాలకు అతీతంగా.. వైసీపీ సర్కారుపై ఉద్యోగులు-నిరుద్యోగులు యుద్ధం ప్రకటిం చేందుకు రెడీగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు, అదే సమయంలో తమకు ఇచ్చిన మాట ప్రకారం జాబ్‌లు ఇవ్వాలని నిరుద్యోగులు ఇప్పటికే రోడ్డెక్కారు. ఇక, ఎన్నికలకుముందు.. వీరు తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించడం.. వైసీపీకి ఒకరకంగా సెగపెట్టే అంశమేనని అంటున్నారు.
కాంట్రాక్టర్లు..
ప్రధానంగా నిన్న మొన్నటి వరకు మౌనంగా ఉన్న కాంట్రాక్టర్ల అసోసియేషన్ `బాయ్` కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమైంది. గత నాలుగేళ్లుగా తమకు రావాల్సిన 1500 కోట్ల రూపాయల బకాయిలను పొందాలనే సంకల్పంతో బాయ్ అడుగులు వేస్తోంది. రేపు ప్రభుత్వం మారితే.. ఆ నిధులు వస్తాయో.. రావో అన్న ఉద్దేశంతోవైసీపీపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యాచరణ కూడా రెడీ చేసుకుంది. డిసెంబరు 10వ తేదీ లోపు సర్కారు స్పందించకపోతే.. 11 నుంచి ఉద్యమాలకు రెడీ కాక తప్పదని బాయ్ తాజాగా హెచ్చరించింది. మొత్తంగా ఈ పరిణామాలతో ఎన్నికలకు ముందు.. వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోందనే చర్చ జరుగుతుండడం గమనార్హం.