స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును అక్రమంగా అరెస్టుచేసిన సంతోషం సీఎం జగన్, వైసీపీ ముఖ్యులకు ఎక్కువ రోజులు నిలువలేదు. ఈ పరిణామంపై రాష్ట్రంలో, దేశవిదేశాల్లో వ్యక్తమైన ఆగ్రహావేశాలు వారికి దిగ్ర్భాంతి కలిగించాయి. ‘చంద్రబాబును అరెస్టు చేస్తే ఏమవుతుంది? మహా అయితే రెండు రోజులు టీడీపీ కార్యకర్తలు నిరసనలు చేస్తారు.
మూడో రోజు నుంచి వాళ్లూ వదిలేస్తారు. సామాన్య జనం అసలే పట్టించుకోరు. అన్నిటికంటే ముఖ్యంగా… నాయకుడు రిమాండ్‌లో ఉంటే టీడీపీ నేతలు, కార్యకర్తలు పూర్తిగా డీలా పడిపోతారు! ఎంచక్కా దొంగ ఓట్లు చేర్పించవచ్చు. టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించవచ్చు..’ ఇదీ జగన్ అండ్ కో అసలు వ్యూహం. కానీ… ఇప్పుడు సీన్ మారిపోయింది. ‘డ్యామిట్ కథ అడ్డం తిరిగింది’ అని అధికార పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టుపై రోజురోజుకూ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతుండటమే దీనికి కారణం.
బాబు, లోకేశ్ జనంలోకి వెళ్లకుండా..
చంద్రబాబు అరెస్టుకు ముందు రాష్ట్రంలో టీడీపీ కార్యకలాపాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత క్షేత్ర స్థాయిలో నిర్విరామ పర్యటనలు చేస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, ప్రాజెక్టుల విధ్వంసం… ఇలా పలు పేర్లతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇసుక, మద్యంలో చోటు చేసుకున్న అవినీతిపై ప్రజంటేషన్లు నిర్వహించారు. టీడీపీ రాజమండ్రి మహానాడులో ఇచ్చిన హామీలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. భవిష్యతకు గ్యారెంటీ పేరిట 45 రోజుల్లో 30 నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రచ్చ బండ సమావేశాలు పెట్టాలని నిర్ణయించి 3-4 నియోజకవర్గాల పర్యటన పూర్తి చేశారు. ఈ పర్యటనలకు ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది.
దీనికి సమాంతరంగా లోకేశ్ యువగళం పాదయాత్ర కోలాహలంగా సాగుతోంది. 200 రోజుల యాత్ర పూర్తి చేసుకుని ఆయన గోదావరి జిల్లాల్లోకి అడుగుపెట్టారు. ఇదే సమయంలో అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి భవిష్యతకు గ్యారంటీ పేరుతో పార్టీ ఇచ్చిన హామీల బాండ్‌ను అందచేయాలని టీడీపీ నాయకత్వం దిగువ స్ధాయి నాయకులను ఆదేశించింది. వారు కూడా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పనిలోపనిగా స్థానిక సమస్యలపై హామీలూ గుప్పిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ జోరు పెంచడం.. ఆ పార్టీ సభలు విజయవంతం కావడం వైసీపీని కలవరపరిచాయి.
ఈ క్రమంలోనే ఎప్పుడో నమోదై, దర్యాప్తులో ఎలాంటి పురోగతీ లేకుండా ఆగిపోయిన కేసులను బయటికి తీశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత నెల 9వ తేదీన చంద్రబాబును అరెస్టు చేశారు. ఈ పరిణామం మొదట్లో అధికార పక్షం ఆశించినట్లుగానే ప్రభావం చూపింది. చంద్రబాబు సభలు ఆగిపోయాయి. లోకేశ్ కూడా తన పాదయాత్ర నిలిపివేయాల్సి వచ్చింది. ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు, రోడ్లమీదికి వస్తే అరెస్టులతో ప్రభుత్వం భయోత్పాతం సృష్టించింది. ఈ నేపథ్యంలో తొలుత రెండు మూడు రోజులు టీడీపీ శ్రేణుల నుంచి నిరసనలు కొంత తక్కువగానే కనిపించాయి. ఆ పార్టీ రాజకీయ కార్యకలాపాలు దాదాపుగా స్తంభించాయి.
కథ ఇలా అడ్డం తిరిగింది…
చంద్రబాబును అసలు రిమాండ్‌కు పంపకపోవచ్చని, పంపినా వెంటనే బయటకు వచ్చేస్తారని టీడీపీ శ్రేణులతోపాటు సామాన్యులూ భావించారు. కానీ… అలా జరగలేదు. దర్యాప్తు సంస్థ నాటకాలు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్‌నెట్ కేసులనూ తెరపైకి తేవడం.. బాబు బెయిల్ తిరస్కరణకు గురవడంతో.. ఈ మొత్తం వ్యవహారం వెనుక పెద్ద కుట్రే ఉందని ప్రజలు అనుమానించడం మొదలుపెట్టారు. ఇవే కేసుల్లో పలువురికి తక్షణమే బెయిల్ రాగా.. చంద్రబాబు ఒక్కరినే ఇన్నాళ్లు జైల్లో పెట్టడం.. దానికి తగినట్లే ఆయన జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రావడం వీటికి బలం చేకూరింది.
చంద్రబాబు, లోకేశ్ యాత్రలు జరిగినప్పుడు స్థానికంగానే చర్చ జరిగేది. మీడియాలో రాష్ట్రవ్యాప్తంగా దానికి ప్రచారం లభించేది. ఇప్పుడు అలా కాదు. ప్రతిరోజూ చంద్రబాబుపై జనంలో చర్చ జరుగుతోంది. ‘స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగినందునే అరెస్టు’ అని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మడంలేదు. ఇదంతా రాజకీయ కక్ష సాధింపేనని స్పష్టంగా అర్థమైంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న విజనరీ చంద్రబాబును, ఇంత పెద్ద వయసులో అన్యాయంగా అరెస్టు చేశారన్న సానుభూతి మొదలైంది.
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి నవ్యాంధ్ర తొలి సీఎంగా ఆయన పనితీరు ఎక్కడికక్కడ చర్చకు వస్తోంది. అదే సమయంలో… ప్రజావేదిక కూల్చివేత మొదలుకొని, అమరావతిని అటకెక్కించడం, అక్రమ కేసులు, నిర్బంధాలు, అభివృద్ధి లేమి, పెరుగుతున్న అప్పులు ఇలా జగన్ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందనే చర్చ కూడా జరుగుతోంది. ఇది వైసీపీ నేతలు ఊహించని పరిణామం! వివిధ వర్గాల్లో అంతర్గతంగా వ్యాపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత జగన్ అండ్ కోను ఆందోళనకు గురి చేస్తోంది. తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ వ్యతిరేకత తగ్గించుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు.
ఊరూ వాడా మోత…
చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను ఆపేందుకు పోలీసులను ప్రయోగిస్తున్నా ఫలితం కనిపించడంలేదు. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినా తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి కేసులు పెట్టడం వంటి తీవ్ర చర్యలకు ప్రభుత్వం ఒడిగట్టినా నిరసనలు ఆగడం లేదు. ‘మోత మోగిద్దాం’ పేరుతో టీడీపీ ఇచ్చిన పిలుపు ఊహించని స్థాయిలో విజయవంతమైంది. ఏపీలోనే కాదు… తెలంగాణలో, ఇతర రాష్ట్రాలు, దేశాలు… తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ చంద్రబాబుకు సంఘీభావం వ్యక్తమవుతోంది.
అన్నింటికంటే ముందు… హైదరాబాద్‌లో ఐటీ నిపుణులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు అనేక వర్గాలను కదిలించాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వంటి నగరాల్లో టీడీపీ ప్రమేయంలేకుండానే మహిళలు, యువత ఎవరికి వారే సమాచారం పంపుకొని పెద్ద పెద్ద ర్యాలీలు తీశారు. ఇక… కర్ణాటక, తమిళనాడులోనూ అనేక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గుంటూరులో జరిగిన ర్యాలీని తలదన్నేలా బెంగుళూరు నగరంలో భారీ ప్రదర్శన జరిగింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ ఏదో రూపంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
తెలంగాణలో టీడీపీ అభిమానులు చాలాకాలంగా స్తబ్దుగా ఉంటున్నారు. తమ పార్టీ జెండాను కూడా బహిరంగంగా పట్టుకోలేని పరిస్థితి. కానీ, చంద్రబాబు అరెస్టు వీరందరినీ కదిలించింది. చిన్న చిన్న మండల కేంద్రాలు, పట్టణాల్లో కూడా టీడీపీ జెండాలు పట్టుకొనో, ‘వియ్ ఆర్ విత సీబీఎన్’ పోస్టర్‌తోనో ర్యాలీలు చేశారు. సిద్దిపేట వంటి చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు జరగడం గమనార్హం. ఓటు వేయడానికి బయటికి రాని వారు సైతం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రోడ్లమీదికి వస్తున్నారు. గతంలో పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనని వారు కూడా ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు.
చంద్రబాబు అరెస్టు రూపంలో ఎన్నికల ముందు లేని కొరివిని తలకు అంటించుకున్నట్లయిందని గోదావరి జిల్లాలకు చెందిన అధికార పక్ష నేత ఒకరు వాపోయారు. చంద్రబాబు అరెస్టుతో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ‘దిద్దుబాటు చర్యలు’ ఉంటాయని అధికార పక్ష ముఖ్యుడు ఒకరు మీడియా ప్రతినిధులకు సంకేతాలు ఇచ్చారు. లోకేశ్‌ను అరెస్టు చేసే విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించకుండా 41ఏ నోటీసు ఇవ్వడం దీనిలో భాగమేనని తెలుస్తోంది. అయితే చంద్రబాబు వ్యవహారంలో ఎలా బయటపడాలో జగన్ అండ్ కోకు అంతుపట్టడం లేదు. కోరి కొరవితో తల గోక్కున్నామని మధనపడుతున్నారు.