తన తండ్రి, దివంగత నేత వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదంటూ వైఎస్ సునీతా రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో ఏపీ ప్రభుత్వం సహకారం ఉంటే తాను ఢిల్లీవరకు ఎందుకొస్తానని, ఈ కేసు విచారణ గురించి ఏపీ సర్కార్ నే అడగాలని జగన్ ను ఉద్దేశించి సునీత చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు అస్త్రాలుగా మారాయి. దీంతో, జగన్ ను విపక్ష నేతలు ప్రశ్నలతో, విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు జగన్ ను టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య వెనుక జగన్ బంధువులే ఉన్నారని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో వివేకానందరెడ్డి మర్డర్ మిస్టరీ అంశాన్ని లేవనెత్తుతానని రఘురామ షాకింగ్ కామెంట్లు చేశారు.
తనపై కేసులు పెట్టాలని తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఛైర్మన్ పై జగన్, విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ ఒత్తిడి తెస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకాను గొడ్డలి పోటు పొడిచింది ఎవరని రఘురామ ప్రశ్నించారు. వివేకా హత్యానంతరం కట్లు కట్టిన వైద్యులెవరో తేల్చాలని జగన్ ను డిమాండ్ చేశారు. హత్య జరిగిన వెంటనే స్థానిక సీఐతో ఓ వైసీపీ ఎంపీ ఏం మాట్లాడారని, సీబీఐ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఏం మాట్లాడారని పరోక్షంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.