స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఎట్టకేలకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో, కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందే, చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ రోజు కీలక ఆదేశాలను జారీ చేసింది. చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది.
మరోవైపు, స్కిల్ కేసులోనే చంద్రబాబు రిమాండ్ ఆర్డర్ సస్పెండ్ చేయాలని, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు గతంలో కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై కూడా విచారణ పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. దీపావళి సెలవులు నేపథ్యంలో తీర్పును రిజర్వ్ చేసింది. మరో రెండు, మూడు రోజుల్లో ఆ తీర్పు కూడా వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏది ఏమైనా చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కాగా, ఏపీ ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్ల కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, లిక్కర్ షాపుల టెండర్ల కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ల విచారణ ఇంకా పూర్తి కాలేదు.