స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతికి పాల్పడ్డారంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు పై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేయడం.. అనంత రం జైలుకు తరలించడం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అనేక మంది వైసీపీ సర్కారు తీరు ను ఎండగట్టారు. ఈ వయసులో చంద్రబాబును ఇలా చేయడం గర్హనీయమని అన్నారు. ఇక, ఎట్టకేలకు 52 రోజుల తర్వాత.. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చింది.
తన ఆరోగ్యం బాగోలేదని, కుడి కంటికి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉందని.. బెయిల్ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టును చంద్రబాబు కోరిన నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు బయటకు రావడం.. ఆయన కుడి కంటికి హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు చికిత్స చేయడం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రెస్ట్ తీసుకుంటున్నారు.
అయితే.. ఈ మధ్యంతర బెయిల్ గడువు ఈ నెల 30తో ముగియనుంది. అంటే.. ఆదివారం నుంచి కేవలం 12రోజుల గడవు మాత్రమే ఉంది. ఇక, ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలన్న చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై తీర్పు ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు ప్రభుత్వం తరఫున వాదనలు కూడా వినిపించాల్సి ఉంది. దీంతో ఈ నెల 28లోగా రెగ్యులర్ బెయిల్‌పై తీర్పు వస్తే.. ఇబ్బంది లేదు. కానీ, రాకపోతే ఏం చేయాలన్న అంశంపై చంద్రబాబు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.
ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను మరికొన్ని వారాల పాటు పొడిగించేలా కోరుతూ.. చంద్రబాబు పిటిషన్ వేయనున్నట్టు ఆ పార్టీ లీగల్ సెల్ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు హృదయ సంబంధం సమస్య కూడా ఉందని ఇటీవల వైద్యులు హైకోర్టుకు నివేదించారు. అదేసమయంలో ఆయనను నిరంతరం పరీక్షించాల్సి ఉందని కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ రాకపోతే.. మధ్యంతర బెయిల్‌ను మరికొన్ని వారాలు పొడిగించే అవకాశం ఉందని.. దీనిపై కోర్టును ఆశ్రయించనున్నట్టు టీడీపీ లీగల్ సెల్ పేర్కొంది.