‘మీరు మా గొప్పసాయం చేశారు. మీ మేలు మరువలేం.. మీకు రుణపడి ఉంటాం’ అని మనకు మేలు చేసిన వారికి కృతజ్ఞతగా మనం చెబుతుంటాం. ఈ కృతజ్ఞత ఎవరికి చూపుతాం? సొంత ఖర్చుతో మనం సాయం చేసేవారికి.. లేదంటే ఆపదలో ఉన్నప్పుడు మనకు ఆపన్నహస్తం అందించే వారికి! కానీ జనం సొమ్మును తన పేరిట, తండ్రి పేరిట ఇచ్చి మీకు నేను గొప్పసాయం చేశాను.. మీరు నాకు రుణపడ్డారు.. ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేయండి అంటే.. అమాయకత్వం అనుకోవాలా.. పిచ్చిపట్టిందనుకోవాలా.. లేక దొరతనపు దురహంకారమా? రుణపడ్డావు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఓట్లేసి మళ్లీ గెలిపించాలని పరోక్షంగా బెదిరించడం అన్న మాట.
జనం ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ఆలోచనలు ఇలా విపరీత పోకడలు పోతున్నాయి. ఓట్లేసి గెలిపించిన ప్రజలే తనకు రుణపడిపోయారన్న భ్రమల్లో ఆయన బతుకున్నారు. తన పేరిట ఓ లేఖను ప్రజలకు పంపించబోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకం ద్వారా లబ్ధిపొందినందుకు ముఖ్యమంత్రికి రుణపడి ఉన్నామని ప్రతి లబ్ధిదారు నుంచీ హామీ పత్రం తీసుకోబోతున్నారు.
సొంత జేబుల్లో నుంచి ఇస్తున్నారా?
ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలిచి అధికారం చేపట్టిన ప్రభుత్వం.. ప్రజలకే జవాబుదారీ. దేశ రాజ్యాంగం, చట్టాలకు లోబడి ప్రజలకు సేవ చేయాలి. ప్రజాసంక్షేమం, అభివృద్ధి పరమావధిగా పనిచేయాలి. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మే రాష్ట్ర బడ్జెట్. దాంట్లో నుంచి ఖర్చుపెట్టే ప్రతి రూపాయికీ శాసనసభే జవాబుదారీ. ముఖ్యమంత్రి, మంత్రులు, లేదా వ్యక్తులెవరూ తమ సొంత జేబుల్లో నుంచి ప్రజల సేవకు, సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుపెట్టడం లేదు. జనం సొమ్ము ఉండే ఖజానా నుంచే ఖర్చుపెడుతూ.. తామే ప్రభువులమని, దేవుళ్లమని విర్రవీగుతూ.. ప్రజలను బిచ్చగాళ్లుగా జమకడితే.. వారు కర్రుకాల్చివాత పెడతారు. ప్రజల చేతిలో చావుదెబ్బలు తిన్న అనేక ప్రముఖులు, ప్రభుత్వాలు అడ్రస్ లేకుండా పోయాయి.
ఏమిటీ వెర్రి?
లబ్ధిదారులకు జగన్ పేరిట రెండు పేజీల లేఖ పంపుతారు. దాని కవర్ పేజీపై చిరునవ్వులు చిందించే ముఖ్యమంత్రి ఫోటో, దాని చుట్టూ నవరత్న పథకాలు ఉంటాయి. లోపలి పేజీలో ఆయన మనసులోని మాటలు పొందుపరిచారు. దాంట్లోనే ఆ లేఖ తమకు అందినట్లుగా అంగీకరిస్తూ, తమకు లబ్ధిచేకూర్చినందుకు ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి రుణపడి ఉంటామని లబ్ధిదారు లిఖితపూర్వక ఆమోదముద్ర వేసే కన్సెంట్ పత్రం ఉంది. అది లబ్ధిదారు సంతకంతో తిరిగి వలంటీరుకు ఇవ్వాలి. అతడు/ఆమె దానిని ప్రభుత్వానికి చేరుస్తారు. జగన్ పదేపదే బహిరంగసభల్లో చెప్పే మాటలే ఈ లేఖలో పొందుపరిచారు.
‘దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో మీకు లబ్ధిచేకూర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సంతోషపడుతున్నాను. దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, మంచిచేసే మనందరి ప్రభుత్వంమీద కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన ్యవాదాలతో జగన్’ అని ఉంది. ఇందులో తప్పుపట్టే అంశాలు లేవు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసింది చెబుతున్నారు. కానీ ఆ లేఖతోపాటు క న్సెంట్ పత్రంపై లబ్ధిదారుడి హామీ తీసుకోవడంపైనే అభ్యంతరాలున్నాయి. ‘—- అనే నాకు, నా కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో లబ్ధిచేకూరినందుకు సంతోషిస్తున్నాను. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను’’ అని లబ్ధిదారుడు తన స్వీయ ధృవీకర ణ, ఆమోదం ఇచ్చేలా ఆ లేఖలో అక్నాలెడ్జ్మెంట్ను చేర్చారు.
ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూల చేసిన సొమ్మును తిరిగి సంక్షేమ పథకాలతో ప్రజలకే అందించడం జగన్ సర్కారు చేసిన ఘనకార్యమా? లేక ప్రపంచంలో ఆయనొక్కరే ఈ ఘనకార్యం నిర్వర్తిస్తున్నారా? రాజుల కాలంలో సైతం ప్రజల నుంచి పన్నులు పిండి తిరిగి ప్రజల కోసమే చేసేవారు. అప్పట్లో ప్రజలను రాజులు కొందరు బానిసలుగా చూస్తే మరి కొందరు తమ సొంతబిడ్డల్లా చూశారు. కానీ ప్రజలు తమకు రుణపడి ఉన్నారని ఏ రాజు, చక్రవర్తి ప్రకటించలేదు. ఇప్పుడున్నది ప్రజాస్వామ్యం. జగన్ తన సొంత డబ్బుతో ప్రజా ప్రభుత్వాన్ని నడపడం లేదు.
ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన సొమ్ముతోనే ఆయన సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అందులోనుంచే ఆయన, మంత్రులు, సలహాదారులు, ఇంకా ఇంకా అనేక మంది జీతాలు పొందుతున్నారు. ప్రజల సొమ్మును వారికి చేర్చి, ఈ పనిచేసినందుకు ప్రజలే తమకు రుణపడి ఉన్నారని లిఖితపూర్వక ఆమోదం తీసుకోవడం ఏమిటని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ‘ముఖ్యమంత్రి తీరు నేనే దైవం, ప్రజలు నాకు రుణపడి ఉన్నారని భావిస్తున్నట్లుగా ఉంది. ఇలాంటి పిచ్చిపనులు హిట్లర్, తుగ్లక్ కూడా చేయలేదు. ఎవరి సొమ్మును ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఎవరు రుణపడి ఉన్నారో జగన్కు ఆయన మంత్రులు, సలహాదారులైనా చెప్పాలి. లేదంటే ఆయనేదో వింత ఆలోచనల్లో ఉన్నారని అంతా అనుకునే ప్రమాదం ఉంది’ అని వ్యాఖ్యానిస్తున్నారు.