ఒకవైపు ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. మరోవైపు విపక్షాలు కత్తులు దూస్తున్నాయి. దీంతో అధికార పార్టీ నాయకులు తల్లడిల్లుతున్నారు. ఏదో ఒకరంగా ప్రజల మెప్పుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మ ఒడి.. జగనన్న ఇళ్లు.. వంటి పథకాలను చూపిస్తున్నారు. కానీ, ఇంతలోనే వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం. దానిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండడంతో నేతలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
ఒకవైపు.. ఇప్పటికే 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన మద్య నిషేధ హామీ అమలు కావడం లేదు. విడతల వారీగా రాష్ట్రంలో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన ఆయన .. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. సరికదా.. మరింతగా రేట్లు పెంచి.. నాసిరకం మద్యాన్ని పారిస్తున్నారని.. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విషయం ఒకవైపు రగులుతూనే ఉంది.
ప్రజాక్షేత్రంలోని గడపగడపకు, భరోసా యాత్రలు చేస్తున్న వైసీపీ నాయకులకు ఇది ప్రాణసంకటంగా మారింది. ఇంతలోనే.. తాజాగా మద్యం ధరలను మరోసారి పెంచుతూ.. సర్కారు నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలను వెంటనే అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. క్వార్టర్‌పై రూ.10, ఫుల్ బాటిల్‌పై రూ.20 ధర వసూలు చేస్తున్నారు. ఇక, బడా బాబులా సేవించే ఫారిన్ లిక్కర్ ధరలు 20% పెంచారు. అదేసమయంలో రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను రూపాయల నుంచి శాతాల్లోకి మార్చారు.
దీంతో ఒక్కసారిగా ధరలు ఆకాశాన్నంటాయి. ఐఎంఎఫ్ఎల్ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం వరకు పెంచడంతో మద్యం ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. ఇక, బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం పెంచడంతో వీటి ధరలు కూడా చుక్కలు తాకుతున్నాయి. ఒక ఫుల్ బాటిల్ ప్రస్తుతం రూ.570 ఉంటే రూ.590కి పెరిగిపోయింది. దీంతో నాయకులు ఇక, రోడ్డెక్కలేని పరిస్థితి, గడపగడపకు తిరగలేని పరిస్థితి ఏర్పడిందనే చర్చ సాగుతోంది. ఇలా అయితే.. ఎలా వెళ్తాం.. అంటూ నాయకులు ముఖం చాటేస్తున్నారు. పైగా ఎన్నికల సీజన్ కావడంతో తల్లడిల్లుతున్నారు.