తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కొన్నినియోజకవర్గాలు హాట్ టాపిక్‌గా మారాయి. దీనికి కారణం.. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులే. బలమైన అభ్యర్థుల మధ్య దాదాపు 50 నియోజకవర్గాల్లో పోటీ జరుగుతోంది . ఇలాంటి వాటిలో ఒకటి పాలేరు. ఇక్కడ నుంచి స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి బీఆర్ ఎస్ తరఫున బరిలో నిలచారు. ఇదే సమయంలో ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీ చేస్తున్నారు.
అయితే.. రాజకీయంగా ప్రత్యర్థుల మధ్య పోటీ ఉంటుంది. అదే సమయంలో మాటల తూటాలు కూడా పేలుతుంటాయి. ఇక, ఎక్కడ అవకాశం ఉంటే.. దానిని వినియోగించుకోవడం కూడా కామనే. ఇలానే పాలే రులో నాన్‌లోకల్ అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తోంది. కందాళ స్థానికుడు కావడం గమనార్హం. అయితే.. ఆయనపై పోటీకి దిగిన.. పొంగులేటి మాత్రం సత్తుపల్లి నియోజకవర్గానికిచెందిన నాయకుడు దీంతో ఈ విషయం ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మారిపోయింది.
గతంలోనూ…
వాస్తవానికి గతంలోనూ.. నాన్‌లోకల్ అంశం చర్చకు వచ్చింది. 2014లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రామిరెడ్డి వెంకట రెడ్డి విజయందక్కించుకున్నారు. అయితే.. ఆయన రెండేళ్లకే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో 2016లో ఉప ఎన్నిక వచ్చింది. అప్పట్లో బీఆర్ ఎస్ తరఫున నాన్ లోకల్ అయినప్పటికీ.. తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ నుంచి పోటీ చేశారు. చనిపోయిన రామిరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేశారు. కానీ, అప్పట్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. దీంతో తుమ్మల విజయం దక్కించుకున్నారు.
కానీ, తర్వాత 2018లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కందాళ ఉపేందర్రెడ్డిపోటీ చేయగా.. బీఆర్ ఎస్ తరఫున తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలిచారు. అప్పటి ఎన్నికల్లో నాన్‌లోకల్-లోకల్ అంశం ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేసింది. కందాళ స్థానిక పాలేరు వ్యక్తి కావడంతో నేను లోకల్ అనే అంశాన్ని ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. దీనికి ప్రజలు కూడా జై కొట్టారు. ఆ ఎన్నికల్లో తుమ్మల ఘోరంగా ఓడిపోయారు.
ఇక, ఇప్పుడు కూడా ఇదే విషయం తెరమీదికి వచ్చింది. కందాళ ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో గెలిచినా.. తర్వాత కేసీఆర్ పాలనకు ముగ్ధుడై.. ఆయన బీఆర్ ఎస్‌కు జై కొట్టారు. తాజా ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరఫునే పోటీ చేస్తున్నారు. మరోవైపు స్థానికేతరుడు అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు.అయితే.. ఈయన సత్తుపల్లికి చెందిన నాయకుడు.
దీంతో తన ప్రచారంలో కందాళ నాన్ లోకల్ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కానీ, దీనికి దీటుగా.. పొంగులేటి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడం గమనార్హం. మరి ప్రజలు ఏం చేస్తారో చూడాలి. ఎవరైనా స్థానికంగా ఉంటూ.. తమ సమస్యలను పరిష్కరించేవారికే మొగ్గు చూపుతారనే విషయం తెలిసిందే. దీనిని బట్టి.. స్థానికుడైన ఉపేందర్‌రెడ్డి లోకల్ అస్త్రం విషయంలో పొంగులేటికి చెమటలు పట్టిస్తోన్నారు.