వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సామాన్యులు మొదలు ప్రతిపక్ష నేతల వరకు రక్షణ లేకుండా పోయిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అధికార బలంతో వైసీపీ నేతలు సామాన్య ప్రజల నుంచి విపక్ష నేతల వరకు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులను అడ్డుపెట్టుకొని అధికార యంత్రాంగాన్ని వాడుకొని ప్రజలు, ప్రతిపక్ష నేతలను వేధించడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. అయినా సరే ఆ నేతల తీరు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి రోజా నుంచి తమకు ప్రాణహాని ఉందని ఓ ప్రేమ జంట సంచలన ఆరోపణలు చేసింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడంలేదని ఆరోపించింది. మంత్రి రోజా ఆదేశాలతోనే పోలీసులు తమకు రక్షణ కల్పించడం లేదని ఆరోపించింది. చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ప్రవీణ నెల్లూరుకు చెందిన జిలానీలు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, మతాంతర వివాహానికి ప్రవీణ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ప్రవీణ ఇంటి నుంచి పారిపోయి జిలానీని పెళ్లి చేసుకుంది.
ఈ క్రమంలోనే ప్రవీణ తల్లిదండ్రులు మంత్రి రోజాను ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. దీంతో, రోజా నుంచి తమకు ప్రాణహాని ఉందని ప్రవీణ, జిలానీలు వాపోతున్నారు. తమకు ఏదైనా జరిగితే రోజాదే బాధ్యత అని వారు హెచ్చరించారు. ఈ ప్రకారం డీజీపీకి వారు ఫిర్యాదు చేసి రక్షణ కల్పించాలని కోరారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి, ఈ ఆరోపణలపై రోజా ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.