ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో తీవ్ర వివాదం ముసురుకుంది. ఈ క్రమంలో పోలీసులపై దొమ్మేరు గ్రామ ప్రజలు తిరగబడడం.. పోలీసు వాహనం ధ్వంసం కావడం సంచలనంగా మారింది. మరోవైపు.. ఇక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు వచ్చిన వైసీపీ మంత్రులను స్థానికులు ఘెరావ్ చేశారు. దీంతో కొవ్వూరులో ఏం జరుగుతోంది? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది?
కొవ్వూరు నియోజకవర్గం లోని దొమ్మేరు గ్రామ అధికార వైసీపీ వర్గ విభేదాల కారణంగా మంత్రి తానేటి వనితకు చెందిన ప్లెక్సీ చింపారని దళిత యువకుడు బొంతా మహేంద్రను కొవ్వూరు పోలీస్ స్టేషన్ కి విచారణ పేరుతో పిలిచి దూషించారని ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో మనస్తాపంతో మహేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. దారుణ సంఘటనకు బాధ్యులైన వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహేంద్ర కుటుంబం సహా.. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక, ఇప్పటికే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన దొమ్మేరు ఎస్సైపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. ఇదిలావుంటే, దళిత యువకుడి శవంతో దొమ్మేరు గ్రామస్థులు.. నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఆయన కుటుంబం కూడా డిమాండ్ చేసింది. దీంతో తలెత్తిన వివాదాన్నిసర్దు బాటు చేసేందు కు కొందరు మంత్రులు అక్కడకు వెళ్లారు. అయితే.. వారిని స్థానికులు ఘెరావ్ చేశారు. వీరిలో తానేటి వనిత, నాగార్జున, పినిపే విశ్వరూప్ ఉన్నారు.
దీనిని పోలీసు హత్యగా టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అధికార పార్టీ గ్రూపు తగాదాలు పోలీసులు కలిసి దళిత యువకుడు మహేంద్ర చనిపోవడానికి కారణమని నిరసన వ్యక్తం చేశారు. వైసీపీలో వర్గ పోరులో దళిత యువకుడు బలికావటం బాధాకరమని.. ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి మహేంద్ర ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలో పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.