స్వదేశంలో జరుగుతున్న వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు తన అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా సెమీస్ చేరిన టీమిండియా తాజాగా న్యూజిలాండ్ ను మట్టి కరిపించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ నాకౌట్ పోరులో కివీస్ పై భారత్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ విజయంలో పేస్ బౌలర్ మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు.
కివీస్ బ్యాటర్ల నడ్డి విరిచిన షమీ 9.5 ఓవర్లు వేసి 7 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కివీస్ బ్యాట్స్ మన్ డెరైల్ మిచెల్ (134) సెంచరీ చేసి ప్రమాదకరంగా కనిపించాడు. కెప్టెన్ విలియమ్సన్(69) తో కలిసి 181 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ప్రమాదకర జోడీని షమీ ఔట్ చేయడంతో భారత విజయం దాదాపు ఖరారైంది. ఈ క్రమంలోనే షమీ 9 ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.
ఆ 10 రికార్డులు ఇవే…
* వన్డే ప్రపంచ కప్ లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన షమీదే. 2003 ప్రపంచ కప్ సందర్భంగా ఇంగ్లండ్ పై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా 23 పరుగులకు 6 వికెట్లు తీశాడు. తాజాగా కివీస్ పై షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు.
* వన్డే ప్రపంచకప్‌లో 50 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్. మొత్తంగా ఏడో బౌలర్. గ్లెన్ మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్, మిచెల్ స్టార్క్, లసిత్ మలింగ, వసీం అక్రం, ట్రెంట్ బౌల్ట్ ల సరసన షమీ చేరాడు.
* వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన తొలి బౌలర్. 17 ఇన్నింగ్స్‌లలో షమీ ఈ ఘనత సాధించగా ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 19 ఇన్నింగ్స్‌లలో సాధించాడు.
* ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ లో షమీదే అత్యుత్తమ ప్రదర్శన. 48 ఏళ్ల క్రితం 1975 ప్రపంచకప్ సెమీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు గ్యారీ గిల్మౌర్ 12 ఓవర్లలో 6 మెయిడెన్లు వేసి 14 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. 7/57 తో షమీ ఆ రికార్డు బద్దలు కొట్టాడు.
* ప్రపంచకప్‌లో ఎక్కువసార్లు 5 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా షమీ రికార్డులకెక్కాడు. ఆసీస్ బౌలర్ స్టార్క్ 26 మ్యాచుల్లో 3 సార్లు 5 వికెట్లు పడగొట్టగా షమీ 19 మ్యాచ్ లలోనే ఆ ఘనత సాధించాడు. ఆ 5 సార్లలో మూడు సార్లు ఈ వరల్డ్ కప్ లో కావడం విశేషం.
* ప్రపంచకప్ సింగిల్ ఎడిషన్‌లో ఎక్కువసార్లు 5 వికెట్లు తీసిన తొలి బౌలర్ షమీ. 3 సార్లు 5 వికెట్లు తీసిన షమీ తర్వాత గ్యారీ గిల్మౌర్ (1975), అశాంత డె మెల్ (1983), వాస్బెర్ట్ డ్రాక్స్(2003), షాహిద్ ఆఫ్రిది (2011), ముస్తాఫిజుర్ రహ్మాన్ (2019) రెండేసి సార్లు 5 వికెట్లు పడగొట్టారు.
* ప్రపంచకప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఇండియన్ బౌలర్ షమీనే. 2011లో జహీర్‌ఖాన్ 9 మ్యాచుల్లో 21 వికెట్లు పడగొట్టాడు. షమీ 6 మ్యాచ్ లలో 23 వికెట్లు పడగొట్టాడు. షమీ మొదటి 4 మ్యాచ్ లు ఆడి ఉంటే ఈ రికార్డు మరింత మెరుగ్గా ఉండేది.
* న్యూజిలాండ్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను షమీ నమోదు చేశాడు. 2002లో పాక్ పేసర్ షోయబ్ అక్తర్ 9-11-16-6 తో కివీస్ పై అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. 7/57 తో షమీ ఆ రికార్డ్ బద్దలుకొట్టాడు.
* వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నెలకొల్పిన ఇండియన్‌గా షమీ రికార్డు సృష్టించాడు. 2014లో మీర్పూర్లో బంగ్లాదేశ్‌పై స్టువార్ట్ బిన్నీ 4.4 ఓవర్లలో 2 మెయిడెన్లు వేసి 4 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. షమీ 9.5 ఓవర్లలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు.
* వన్డే ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన ఐదో బౌలర్ షమీ. గతంలో గ్లెన్ మెక్‌గ్రాత్, ఆండీ బిచెల్, టిమ్ సౌథీ, విన్స్టన్ డేవిస్ ఏడేసి వికెట్లు తీసుకున్నారు.
ఇక, తాజాగా కివీస్ పై విజయంతో టీమిండియా నాలుగోసారి వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. ప్రపంచ కప్ సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. 1983 లో కపిల్ డెవిల్స్ టీం, 2011లో ధోనీ సేన వరల్డ్ కప్ ఫైనల్ కు చేరి భారత్ కు కప్ సాధించాయి. 2003 ప్రపంచ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు పరాజయం పాలైంది. ఇక, 2023లో స్వదేశంలో జరుగుతున్న ఈ ప్రపంచకప్ ఫైనల్ లో హాట్ ఫేవరెట్ గా భారత జట్టు బరిలోకి దిగనుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల మధ్య జరగబోయే రెండో సెమీస్ లో గెలుపొందిన జట్టు ఈ నెల 19న అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ లో భారత్ తో తలపడనుంది.