వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని పోలీసులు అరెస్టు చేసిన వైనం హైడ్రామాను తలపించినట్లుగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వచ్చి బీటెక్ రవిని తీసుకెళ్లారని. ఆయన్ను కిడ్నాప్ చేశారంటూ కాసేపు ప్రచార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున హడావుడి జరిగింది.అయితే.. ఆయన్ను మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్టు చేసినట్లుగా తర్వాత తేలింది.
ఇంతకూ ఆయన చేసిన నేరం ఏమిటి? ఏ కేసులో ఆయనను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన యువగళం కార్యక్రమంలో భాగంగా పాదయాత్రను ప్రారంభించటానికి రెండు రోజుల ముందు అంటే జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం.. పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్ ను స్వాగతం పలకటానికి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు.. కార్యకర్తలతో కలిసి బీటెక్ రవి కడప ఎయిర్ పోర్టుకు వచ్చారు.
ఎయిర్ పోర్టు లోపలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో బీటెక్ రవి వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. దీనిపై కేసు నమోదైంది. అయితే.. ఈ ఘటన జరిగిన పది నెలల తర్వాత పోలీసులు ఈ ఉదంతంపై కేసు నమోదు చేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో పులివెందుల నుంచి కడపకు వస్తుండగా.. నంది మండలం వరకు ఫోన్ కు అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత ఆయనతో పాటు.. డ్రైవర్.. గన్ మెన్ ఇతర సహాయకుల ఫోన్లు పని చేయలేదు.
దీంతో.. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పార్టీ కీలక నేతలకు విషయాన్ని తెలియజేశారు. ఆ సమయంలోనే మఫ్టీలో ఉన్న పోలీసులు యోగి వేమన వర్సిటీ వద్ద బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని గుర్తించారు. దాదాపు గంట పాటు పోలీసుల అదుపులో గన్ మెన్.. డ్రైవర్.. వ్యక్తిగత సహాయకులు ఉన్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత వారిని వదిలి.. అందరికి ఫోన్లు ఇచ్చారు. తర్వాత రవిని వల్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడి నుంచి కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు హాజరుపర్చారు.
ఇంతకూ ఇంత హడావుడి ఎందుకు జరిగినట్లు? అన్న ప్రశ్నకు పోలీసుల సమాధానం ఏమంటే.. కడప ఎయిర్ పోర్టు ఘటన తర్వాత బీటెక్ రవి అందుబాటులో లేరని.. ఎయిర్ పోర్టు వద్ద జరిగిన తోపులాటలో ఏఎస్ఐకి గాయాలు అయ్యాయని.. దానిపై విచారణ జరిపి కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. పది నెలలు బీటెక్ రవి అందుబాటులో లేని కారణంగా.. తాజాగా ఆయన్నుగుర్తించి అరెస్టు చేశామన్నారు. ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.