ఐటీ శాఖ అధికారులపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఐటీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. ‘అంత పిచ్చి వెధవలు కాకపోతే మేం ఇళ్లల్లో డబ్బులు పెట్టుకొని కూర్చుంటామా… మీరొచ్చి రైడ్ చేస్తే మీకు దొరకడానికి’’ అంటూ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. వెర్రిబాగుల వెధవలు మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశారు… ఏం పర్వాలేదు అని రేణుకా చౌదరి చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి.
తమ ఇళ్లలో డబ్బులున్నాయని ఐటీ అధికారులు చెబుతున్నారని, పోలీస్ వాహనాలలో డబ్బులు ఎక్కడకు వెళ్తున్నాయని రేణుకా చౌదరి ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో ఐటీ దాడులు జరగడం అలవాటుగా మారిందని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, 3 నెలల తర్వాత జరిగే లోక్ సభ ఎన్నికల్లో 2 సీట్లు కాంగ్రెస్ పార్టీవేనని జోస్యం చెప్పారు.