బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి ఘటన తెలంగాణ రాజకీయాలలో సంచలనం రేపింది. అపోలో ఆస్పత్రిలో చికిత్స తర్వాత మీడియాతో మాట్లాడిన బాలరాజు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, ఆయన అనుచరులు రాళ్లతో తనపై దాడి చేశారని, తన తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెబుతున్నానని అన్నారు. వంశీ, ఆయన అనుచరుల మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై, తనపై దాడితో తెలంగాణలో కొత్త సంస్కృతి తెచ్చారని మండిపడ్డారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అంతమొందించే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మరోవైపు, బాలరాజుపై దాడిని మంత్రి కేటీఆర్ ఖండించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దెబ్బకుదెబ్బ తీస్తామని, వదిలిపెట్టబోమని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజును హరీష్ రావుతోపాటు కేటీఆర్ పరామర్శించారు.