మెగా ఫ్యామిలీలో హీరోల లిస్టు చాలా పెద్దదే. సరదాకి క్రికెట్ టీం అని కూడా పిలుస్తుంటారు ఆ ఫ్యామిలీ హీరోలను. ఈ కటుుంబం నుంచి నటిగా అరంగేట్రం చేసిన ఏకైక అమ్మాయి కొణిదెల నిహారిక. నాగబాబు తనయురాలు ‘ఒక మనసు’ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం కావడం.. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో మరికొన్ని సినిమాల్లో నటించడం తెలిసిందే. కానీ ఆమెకు ఎక్కడా అదృష్టం కలిసి రాలేదు.
నిహారిక నటించిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. నటిగా కూడా ఆమెకు ఆశించినంత పేరు రాలేదు. దీంతో నటనకు దాదాపు దూరం అయిపోయింది నిహారిక. ఆ మధ్య ఒక వెబ్ సిరీస్‌లో కనిపించినా.. అక్కడ కూడా స్పందన అంతంతమాత్రమే. దీంతో నిహారిక రూటు మారుస్తోంది. ఆమె నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఇప్పటికే ఆమె కొన్ని వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్‌లో భాగస్వామి అయింది.
ఇప్పుడు నిహారిక ఒక ఫీచర్ ఫిలింతో పూర్తి స్థాయి నిర్మాతగా మారుతోంది. అందరూ కొత్త వాళ్లతో ఆమె నిర్మిస్తున్న సినిమా తాజాగా మొదలైంది. ఇందులో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. యదువంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ అనే మరో బేనర్‌తో కలిసి నిహారిక సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. హైదరాబాద్‌లో మొదలైన ఈ చిత్రానికి కొత్త పెళ్లికొడుకు, నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ క్లాప్ ఇచ్చాడు. నాగబాబు కెమెరా స్విచాన్ చేశాడు.
ఇంకా మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్, లావణ్య త్రిపాఠి, సుశ్మిత కొణిదెల.. ఇలా చాలామంది వచ్చి నిహారిక సినిమాకు సపోర్ట్ చేశారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో ఒక లేడీ ప్రొడ్యూసర్ ఉన్నారు. చిరంజీవి తనయురాలు సుశ్మిత కొణిదెల కూడా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవితో ఒక సినిమా కోసం ఆమె గట్టిగా ప్రయత్నిస్తోంది. నిహారిక కూడా ప్రొడ్యూసర్‌గా కొంచెం కుదురుకుంటే తన అన్నయ్యతో సినిమాలు తీసే ఛాన్సుంది.