దేశాన్ని నిరంతరం కాపాడుతూ.. సరిహద్దుల్లో చలికీ.. వానకూ ఓర్చుకుంటూ ప్రజల భద్రతకు ప్రాణాలొడ్డ డానికి కూడా వెనుకాడని సైనికులకు ఏపీలో మాత్రం రక్షణ లేకుండా పోయిందని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోలేదనే కారణంగా ఓ సైనికుడిని నడిరోడ్డుపై పోలీసులు బూటు కాళ్లతో తన్నడం.. స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించిన ఘటనపై నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు.
జగనాసుర పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని.. ఎంతో ఆర్భాటంగా తెచ్చిన దిశ చట్టానికి దిక్కూమొక్కూ లేదని నారా లోకేష్ దుయ్యబట్టారు. మహిళల భద్రతకు అంటూ సైకో జగన్ సర్కారు తెచ్చిన ‘దిశ యాప్’ పేరుతో ఏదో దందా నడుస్తోందని ఆయన ఆరోపించారు. మహిళలు తమ మొబైల్లో ఇన్స్టాల్ చేయాల్సిన దిశ యాప్ను పురుషుల మొబైల్లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఇదే విషయాన్ని ప్రశ్నించిన అనకాపల్లి జిల్లా రేగుపాలేనికి చెందిన సైనికుడు సయ్యద్ అలీముల్లాపై పోలీసులు గూండాల్లా దాడి చేయడం దారుణమని నారా లోకేష్ విమర్శించారు. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు.. ఏపీకి వస్తే ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. సైనికులకు కూడా గౌరవం ఇవ్వని జగన్ సర్కారును ప్రతి ఒక్కరూ చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.