ఇసుక స్కామ్ అంటూ సీఐడీ దాఖలు చేసిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ కేసులో చంద్రబాబు ను ఈ నెల 28 వరకు అరెస్టు చేయబోమని సీఐడీ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే 28వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించిన కోర్టు… సీఐడీ తరపు లాయర్ల స్టేట్మెంట్ రికార్డు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.
ఇసుక పాలసీ వల్ల చంద్రబాబు హయాంలో ఏపీ ఖజానాకు రూ. 1,300 కోట్ల నష్టం వాటిల్లిందని ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా ఉన్నారు. దీంతో, ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ చంద్రబాబు తరఫు లాయర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అది ఈ రోజు ఉదయం విచారణకు వచ్చింది. అయితే, చంద్రబాబు తరఫు లాయర్లు పాస్ ఓవర్ కోరడంతో ఈ రోజు మధ్యాహ్నం పిటిషన్ పై విచారణ జరిపారు.
విధానపరమైన నిర్ణయాలకు నేరాలను ఆపాదిస్తున్నారని,17ఏ ప్రకారం కేసు నమోదుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తప్పనిసరి అని చంద్రబాబు తరఫు లాయర్లు వాదించారు. అయితే, ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారని ఎఫ్ఐఆర్ లో ఉందని సీఐడీ తరఫు లాయర్లు వాదించారు.