తెలంగాణలో కరోనా టెస్టులు, గణాంకాల, చికిత్స, ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక బిల్లులకు సంబంధించిన నివేదికల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని హైకోర్టు పలుమార్లు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. కోర్టులంటే తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం లేదని, కరోనా కేసులు, మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని హైకోర్టు గతంలోనే చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తీరు మారకపోవడంతో హైకోర్టు సీరియస్ గా తీసుకుంది.
ఈ క్రమంలోనే తమ ఆదేశాలు పాటించడం లేదన్న కారణంతో తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌కు హైకోర్టు గతంలో కోర్టు ధిక్కరణ నోటీసులిచ్చింది. అయితే, ఈ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేస్తూ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా టెస్టుల అంశంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై గతంలో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో తెలంగాణ సర్కార్ కు ఊరట లభించింది. అయినప్పటికీ కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరు మారడం లేదని హైకోర్టు తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా టెస్టులు, చికిత్స, కట్టడి వ్యవహారంలో తెలంగాణ సర్కార్ నివేదికపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో యాంటీ జెన్ ర్యాపిడ్ టెస్టులనే ఎక్కువగా చేస్తున్నారని, ఆర్టీపీసీఆర్ టెస్టులు 10 శాతం కూడా లేవని ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను నెమ్మదిగా పెంచుతున్నామన్న ఏజీ వాదనతో ఏకీభవించని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్ మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతుంటే, టెస్టులను నెమ్మదిగా పెంచుతున్నామని చెప్పడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని ఆదేశించింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంటే బార్లు, పబ్బులు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించలేదని హైకోర్టు ప్రశ్నించింది.
కరోనా నిబంధనల అమలుకు తీసుకుంటున్న చర్యలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో అధిక సంఖ్యలో జనం లేకుండా తీసుకుంటున్న చర్యలేమిటో చెప్పాలని హైకోర్టు నిలదీసింది. కరోనా పాజిటివ్ రేటు, మరణాల రేటునూ వెల్లడించాలని సర్కారును ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై నమోదైన కేసులు, జరిమానాల వివరాలపై రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, కేంద్రాలకు సంబంధించిన వివరాలను వెంటనే తెలియజేయాలని ఆదేశించింది.