ఏపీ అధికార పార్టీ వైసీపీ లో అంతర్గత కుమ్ములాటలు జోరుగా సాగుతున్నాయి. పైకి అంతా బాగానే ఉందని కలరింగ్ ఇస్తున్నా.. నాయకులు మండలస్థాయిలోకి, గ్రామీణ స్థాయిలోకి వెళ్లి ప్రసంగాలు దంచి కొట్టాలన్నా.. అక్కడి వారిని మచ్చిక చేసుకుని మళ్లీ ఎన్నికలకు రెడీ కావాలన్నా.. దడదడలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీకి కంచుకోటల వంటి నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు చుక్కెదుర వుతోంది. గత టీడీపీ నేతలు అనుసరించిన విధానానికి ఇప్పుడు ఎమ్మెల్యేల తీరుకు ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది.
గుంటూరు, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీకి కంచుకోటల వంటి నియోజకవర్గా లు చాలానే ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఆయా జిల్లాల్లో కేడర్ కూడా.. టీడీపీని ఆదరిస్తోంది. నాయకు లతో సంబంధం ఉన్నా లేకున్నా.. టీడీపీని గెలిపిస్తున్నారు. అయితే.. 2019 ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలు, జగన్ పాదయాత్ర, వైఎస్ ఫొటో వంటివి ఆయా కంచుకోటల్లోనూ వైసీపీ నాయకు లు బొటాబొటి ఓట్లతో విజయం దక్కించుకున్నారు.
ఆ సమయంలో సీఎం జగన్.. ఈ నేతలకు ఏం చెప్పారంటే.. బొటాబొటి ఓట్లతో గెలిచిన స్థానాల్లో సీటును పదిలం చేసుకోవాలంటే.. ఖచ్చితంగా మీరు బాగా తిరగాలి. ప్రజలతో మమేకం కావాలి. వారి సమస్యలు పరిష్కరించాలి. అప్పుడే టీడీపీ నుంచి వచ్చిన ఓటు బ్యాంకు మనకు స్థిరంగా నిలబడుతుంది! అని దిశానిర్దేశం చేశారు. ఇది అప్పట్లో నాయకులకు బాగానే ఉన్నా.. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తు న్న కొద్దీ.. నాయకులు ప్రజలకు చేరువ కాలేక పోయారు.
అంతేకాదు.. కనీసం గ్రామీణ స్థాయిలో అయినా.. ప్రజలను మెప్పించలేనిఎమ్మెల్యేలు ఉన్నారంటే ఆశ్చ ర్యం వేస్తుంది. సొంత పార్టీ నాయకుల్లోనే వ్యతిరేకత పెల్లుబుకుతోంది. తమను పట్టించుకోవడం లేదని కొందరు.. తమను వాడుకుని వదిలేశారని మరికొందరు.. ఇలా అనేక రూపాల్లో నాయకుల అసంతృప్తి కనిపిస్తోంది. దీంతో కేవలం 4 ఏళ్ల కాలంలోనే నాయకులకు-కార్యకర్తలకు-ప్రజలకు మధ్య దూరం పెరిగిపోయింది. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఈ గ్యాప్ ఎప్పుడు భర్తీ అవుతుందో ? అని అధిష్టానం ఎదురు చూస్తోంది.